కొత్తపేరు.. కొత్త కష్టాలు
* తాజాగా టెట్ కమ్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్
* మోగిన డీఎస్సీ గంట
* బీఈడీ అభ్యర్థులకు నిరాశ
* జిల్లాలో తీవ్రమైన పోటీ
నెల్లూరు(విద్య): ఎన్నికలకు ముందు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని పదేపదే వాగ్దానం చేసిన టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయ అర్హత పరీక్షలను వాయిదావేస్తూ వచ్చింది. ఊరించి.. చివరకు బుధవారం పేరుమార్చి టెట్ కమ్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్‌గా విధి విధానాలను ప్రకటించింది. ఎట్టకేలకు ఉపాధ్యాయుల అర్హత పరీక్షకు మంత్రి గంటా మోగించారు. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులని ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రప్రభుత్వం ఒప్పుకోలేదని ఎస్జీటీలకు డీఈడీ అభ్యర్థులే అర్హులని స్పష్టం చేసింది.
గతంలో ఏపీ టెట్ పరీక్ష రాసి అర్హత సాధించిన అభ్యర్థులు సైతం మళ్లీ పరీక్ష రాయాలని నిబంధన విధించింది. 2015 మే తొమ్మిదిన ఎస్జీటీ, 10న ఎల్పీ, పీఈటీ, 11న స్కూల్ అసిస్టెంట్లకు టెట్ కమ్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అర్హత పరీక్షలు నిర్వహించనున్నారు. దీర్ఘకాలికంగా ఎదురుచూసిన అభ్యర్థుల్లో నోటిఫికేషన్ వెలువడుతోందన్న ఆనందం కంటే నిరాశే ఎక్కువైంది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ చేసిన వారికి కూడా అర్హత కల్పిస్తామని నాన్చుతూ వచ్చిన ప్రభుత్వం చివరకు చేతులెత్తేయడం వారి పాలిట శాపంగా మారింది. వయో పరిమితిని 40ఏళ్లకు పెంచారు. 2012లో డీఎస్సీని నిర్వహించారు. ఏపీ టెట్‌లో అర్హత సాధించి మళ్లీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి మరికొంతమందికి నెలకొంది.
ఉమ్మడి పరీక్షల్లో వచ్చిన మార్కులు, గతంలో జరిగిన టెట్మార్కులకు సంబంధించి ఏ పరీక్షల్లో ఎక్కువ మార్కులు వస్తే అందుకు అనుగుణంగా 20 శాతం వెయిటేజీని ఇస్తామని నిర్ణయించారు. దీంతో అభ్యర్థులు కొత్తగా కుస్తీ పట్టాల్సి వస్తోంది. బీఈడీ అభ్యర్థుల సిలబస్ విసృ్తతంగా ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టెట్, డీఎస్సీ సిలబస్ కలిపి ఒకే పరీక్షలో రాయాల్సి రావడం ఇందుకు నిదర్శనం. రెండేళ్ల నుంచి సిలబస్‌పై ఉన్న సందేహాలపై పూర్తిస్పష్టత రావాల్సి ఉంది.
పోస్టుల్లోనూ నిరాశే
జిల్లాలో 416 పోస్టులు భర్తీచేయాల్సి ఉంది. ఎస్జీటీలు 307, స్కూల్ అసిస్టెంట్లు 57, లాంగ్వేజ్ పండితులు 42, పీఈటీలు 10 పోస్టులు ఉన్నాయి. 416 పోస్టులకు వేల సంఖ్యలో అభ్యర్థులు పోటీపడనున్నారు. దీంతో కోచింగ్ సెంటర్లలో విపరీతమైన పోటీ నెలకొననుంది.
బట్టీ విధానం పనికిరాదు
ఉమ్మడి పరీక్షా విధానంలో బట్టీ విధానం పనికిరాదు. ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా, విశ్లేషణాత్మకంగా చదవాలి. చైల్డ్ డెవలప్మెంట్ అంట్ పెడగాని మెథడాలజీలతో పాటు ప్రతి అంశంపై ప్రత్యేక శ్రద్ధ, ప్రణాళిక అవసరం. కనకరాజు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్
పరిపూర్ణ అవగాహన అవసరం
ప్రతి సబ్జెక్ట్‌పై అవగాహన అవసరం. అకాడమీ పుస్తకాలు చదవడం ముఖ్యం. పోటీ తీవ్రతకు భయపడకుండా ప్రణాళికతో చదవాలి. వెంకటేశ్వర్లు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్
సంతోషంగా ఉంది..
ఇప్పటికైనా టీచర్ అర్హత పరీక్షకు నోటిఫికేషన్ వెలువడటం సంతోషంగా ఉంది. ఎస్జీటీ పోస్టులకు ఆరోగ్యకరమైన పోటీ ఉంది. కష్టపడి చదివితే ఉద్యోగం సాధించవచ్చు. సిలబస్‌పై స్పష్టత రావాల్సి ఉంది. డీఎడ్ అభ్యర్థులకు మాత్రమే ఎస్జీటీ పోస్ట్‌లను కేటాయించడం హర్షణీయం. పుష్పలత
ఆనందం లేకుండా పోయింది
నోటిఫికేషన్ ఇచ్చారన్న ఆనందం లేదు. ఇన్ని సంవత్సరాలు ఎదురుచూశాం. గతంలో టెట్‌లో అత్యధిక మార్కులు సాధించాను. మళ్లీ ఇప్పుడు రాయాల్సి వస్తోంది. అన్ని సబ్జెక్ట్‌లను మళ్లీ చదవాలంటే కష్ట సాధ్యం. ఈ ఏడాదికి మామూలు విధానాన్నే అమలు చేసుంటే బావుండేది. మొత్తంమీద మరో విద్యా సంవత్సరం కోల్పోయాం.
-మహేశ్వర్