Texttiles Industry
-
టెక్స్టైల్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం
యడ్లపాడు (చిలకలూరిపేట): గుంటూరు జిల్లా యడ్లపాడు ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్స్ నూలు మిల్లులో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 16వ నంబర్ జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ మిల్లులో నాలుగు వైపులా నాలుగు పెద్ద స్టాక్ గోడౌన్లు ఉన్నాయి. అయితే, విద్యుత్ సబ్‌స్టేషన్ వైపున ఉన్న కాటన్ స్టాక్ గోడౌన్లో శుక్రవారం సా.5.30 సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అప్పటివరకు అక్కడి కార్మికులు ఐదు లారీల్లో వచ్చిన ప్రెస్సింగ్ బేళ్ల (క్యాండిల్స్)ను గోడౌన్లో అన్లోడ్ చేశారు. అనంతరం గంట వ్యవధిలోనే అక్కడ ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మిల్లు సిబ్బంది, కార్మికులు, ఫైర్ అధికారులు ఎందరున్నా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి. దీంతో వందలాది కాటన్ బేళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటన గురించి సమాచారం తెలుసుకున్న మిల్లు జీఎం నర్సింహరావు వెంటనే పోలీస్, ఫైర్‌స్టేషన్లతో పాటు మండలంలోని పలు నూలు మిల్లులకు సమాచారం అందించారు. దీంతో చిలకలూరిపేట, నరసరావుపేట, గుంటూరు ప్రాంతాలకు చెందిన మూడు ఫైర్ ఇంజన్లు మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. వీటికి యడ్లపాడు, నాదెండ్ల మండలంలోని నూలు, కాటన్ మిల్లుల వాటర్ ట్యాంకర్లు సహకారం అందిస్తున్నాయి. కరెంట్ సౌకర్యం లేకపోయినా.. ప్రస్తుతం ప్రమాదం జరిగిన కాటన్ స్టాక్ గోడౌన్లో ఎలాంటి విద్యుత్ సౌకర్యం లేకపోయినా అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్న విషయం అంతుపట్టకుండా ఉంది. అన్లోడింగ్ సమయంలో కార్మికులెవరైనా సిగరేట్ వంటివి పొరపాటున పడేస్తే ప్రమాదం సంభవించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఎకరం విస్తీర్ణంలో ఉండే ఈ గోడౌన్లో ఇతర మిల్లులో ప్రెస్సింగ్ చేసిన బేళ్లతోపాటు ఎన్ఎస్ఎల్ మిల్లులోని జిన్నింగ్ చేసిన బేళ్లు, మరికొంత వేస్ట్ బేళ్లు ఉన్నట్లు సమాచారం. అయితే, ప్రస్తుతం ఎంత స్టాక్ ఉందన్న విషయాన్ని చెప్పలేమని జీఎం తెలిపారు. ఇక మొత్తం బేళ్లతో పాటు గోడౌన్ కూడా పూర్తిగా ధ్వంసమైందని, రూ.కోట్లలోనే ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఫైర్, పోలీసుల విచారణలో ప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలు తేలాల్సి ఉంది. -
తెలంగాణలో టెక్స్ టైల్ కంపెనీ కీటెక్స్ భారీ పెట్టుబడులు
-
ఆ 3 రంగాలే కీలకం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు భవిష్యత్తులో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా టెక్స్టైల్, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పారిశ్రామిక పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. తెలంగాణ పారిశ్రామిక విధానం టీఎస్ఐపాస్, ఇతర ప్రభుత్వ పాలసీల మూలంగా గత ఐదేళ్లలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తరలివచ్చాయన్నారు. మంగళవారం ప్రగతిభవన్‌లో పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. టీఎస్ఐపాస్ ద్వారా ఇప్పటివరకు 11,569 కంపెనీలకు అనుమతులు ఇవ్వగా, ఇందులో 80 శాతం కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయన్నారు. తద్వారా సుమారు 13 లక్షల మందికి ఉపాధి లభించిందని కేటీఆర్ వెల్లడించారు. ఆ మూడు రంగాలకు ప్రాధాన్యత రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమకు ఉన్న అనుకూలతలను దృష్టిలో పెట్టుకుని టెక్స్టైల్ రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కేటీఆర్ వెల్లడించారు. దేశంలోనే అతిపెద్దదైన వరంగల్ మెగా టెక్స్టైల్ పార్కులో కొరియా దిగ్గజ కంపెనీ యంగ్వాన్ భారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నదన్నా రు. మరోవైపు ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో కూడా ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయని, ఇటీవల బెంగళూరులో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం ప్రతినిధులతో నిర్వహించిన భేటీ తరహాలో వివిధ నగరాల్లో మరిన్ని సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. వన్‌ప్లస్, స్కైవర్త్ తదితర కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే ముందుకు వచ్చిన విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. సాగునీటి ప్రాజెక్టు పనుల పూర్తి, వ్యవసాయ రంగానికి ప్రభుత్వ ప్రాధాన్యత తదితరాల నేపథ్యంలో వ్యవసాయ దిగుబడులు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రైతులకు భరోసా దక్కడంతో పాటు, గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేటీఆర్ అన్నారు. పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక వ్యూహం టెక్స్టైల్, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు తెచ్చేందుకు ఆయా రంగాలకు చెందిన కంపెనీలతో ప్రత్యేకంగా చర్చిస్తామని కేటీఆర్ వెల్ల డించారు.ఈ మూడు రంగాల్లో పెట్టుబడులతో దేశం లోకి కొత్తగా వచ్చే అంతర్జాతీయ కంపెనీలు, తమ కార్యకలాపాల విస్తరణకు సిద్ధంగా ఉన్న దేశీయ కంపెనీలు లక్ష్యంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక వ్యూహం అమలు చేయా లని అధికారులకు సూచించారు. ఈ 3 రంగాల పరిశ్రమల కోసం రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ల్యాండ్ బ్యాంక్, ఇండస్ట్రియల్ పార్కుల సమగ్ర సమాచారాన్ని పెట్టుబడులతో వచ్చే వారి కోసం సిద్ధం చేయాలన్నారు. పారిశ్రామిక, ఐటీ రంగాల్లో భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలు సృష్టించడం లక్ష్యంగా పనిచేయడంతో పాటు, రాష్ట్రంలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న కంపెనీలకు ‘టాస్క్’తరహా సంస్థలతో శిక్షణ ఇవ్వాలని కేటీఆర్ ఆదేశించారు. సమావేశంలో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ వెంకట నర్సింహారెడ్డి, వివిధ విభాగాల డైరెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఐటీ శాఖ మంత్రిని కలిసిన హెచ్‌సీఎల్ ప్రతినిధులు
సాక్షి, అమరావతి : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డితో హెచ్‌సీఎల్ ప్రతినిధులు భేటీ అయ్యారు. సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో మంగళవారం సాయంత్రం సమావేశమయ్యారు. నైపుణ్య శిక్షణ గురించి సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. యువతీ, యువకులకు నైపుణ్య శిక్షణ అందించే విధివిధానాలను, కొత్త కోర్సులు, సదుపాయాల వంటి విషయాలను హెచ్‌సీఎల్ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా హెచ్‌సీఎల్ క్యాంపస్‌ని సందర్శించాలంటూ సంస్థ ప్రతినిధులు మంత్రి గౌతమ్ రెడ్డికి ఆహ్వానం పలికారు. హెచ్‌సీఎల్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే 'టెక్ బీ' కార్యక్రమం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, శిక్షణ అందించాలన్న మంత్రి ప్రతిపాదనకు ప్రతినిధులు అంగీకారం తెలిపారు. వచ్చే జనవరి నుంచి హెచ్‌సీఎల్ ప్రారంభించనున్న శిక్షణాపరమైన కార్యక్రమాలను సందర్శించాలని హెచ్‌సీఎల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రవిశంకర్ మంత్రిని కోరారు. యువతకు శిక్షణ అందించేందుకు వసూలు చేసే ఖర్చు తగ్గించాలని మంత్రి కోరారు. అందుకు ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేశారు. చర్చలో భాగంగా, నైపుణ్య రంగంలో శిక్షణాపరమైన అంశాలలో ప్రభుత్వంతో భాగస్వామ్యమయ్యేందుకు ఆసక్తిగా ఉన్నట్లు హెచ్‌సీఎల్ ప్రతినిధులు మంత్రికి తెలిపారు. తనతో జరిగిన భేటీలోని చర్చ సారాంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకుంటామని మంత్రి మేకపాటి ప్రతినిధులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో హెచ్‌సీఎల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రవిశంకర్ పాల్గొన్నారు. వస్త్ర పరిశ్రమలో యంత్రాల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించిన మంత్రి గుంటూరు : మంగళగిరిలో నిర్వహించిన '23వ ప్రాడక్ట్ కమ్ కాటలాగ్ షో' కార్యక్రమానికి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వస్త్ర పరిశ్రమలో వివిధ రాష్ట్రాల్లో వినియోగించే వినూత్న యంత్రాల ప్రదర్శనను మంత్రి తిలకించారు.ఇండియన్ టెక్స్టైల్ యాక్ససరీస్, యంత్రాల తయారీ సంఘం' (ఐటీఏఎమ్ఎమ్ఏ) ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం హాయ్ ల్యాండ్ రిసార్ట్ లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచ మార్కెట్ లో వస్త్ర పరిశ్రమలు అభివృద్ధి చెందేలా ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి వెల్లడించారు. గ్రామీణ మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలను పెంచే విధంగా వస్త్ర పరిశ్రమకు సంబంధించి ప్రత్యేక పాలసీ తీసుకు రానున్నామని మంత్రి మేకపాటి వెల్లడించారు. అధునాతన యంత్రాల వినియోగంతో ఉత్పత్తి చేసే విషయంలో భారతదేశం అగ్రశ్రేణి దేశాలలో ముందుందని అన్నారు. 4.5 కోట్ల మంది ప్రత్యక్ష్యంగా ఉపాధి పొందుతున్న వస్త్ర పరిశ్రమ అభివృద్ధి ఎంతో కీలకమన్నారు. ప్రపంచంలోనే వస్త్ర ఉత్పత్తి చేసే దేశాల్లో భారతదేశం రెండో స్థానంలో ఉందన్నారు. ప్రత్యేకించి వస్త్ర పరిశ్రమకు మూలాధారమైన పత్తి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రపథంలోఉందన్నారు. వస్త్రాలను నాణ్యమైన రీతిలో ఆకర్షణగా తీర్చిదిద్దడంలో ఆంధ్రప్రదేశ్ కళాకారుల నైపుణ్యం ప్రత్యేకంగా కొనియాడదగినదన్నారు. నాణ్యమైన వస్త్ర ఉత్పత్తి, సాంకేతిక పద్ధతుల ద్వారా కృషి చేస్తే వస్త్ర పరిశ్రమ మరింతగా విస్తరించే అవకాశముందని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ స్పిన్నింగ్ మిల్ అసోసియేషన్, మహారాష్ట్రకు చెందిన వస్త్ర పరిశ్రమలు, మార్కెటింగ్ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వస్త్ర పరిశ్రమ ప్రముఖులు హాజరయ్యారు. -
మగ్గాల రోదన ఇంకెన్నాళ్లు ?
అంతరించి పోతున్న చేనేతకు రాయితీలూ, సబ్సిడీలూ వ్యర్థమని ప్రభుత్వాల అభిప్రాయం. ఇలాంటి విధానాలతో చేనేతను నొప్పి తెలియకుండా, నిశ్శబ్దంగా పూర్తిగా చంపేయవచ్చని వారంతా భావిస్తున్నారు. రాజ్యాంగం ప్రసాదిస్తున్న విద్య, వైద్యం, కనీసం గృహవసతి లాంటి సౌకర్యాలు చేనేతలకు లేవు. చేనేత పరిశ్రమ నానాటికీ జవజీవాలు కోల్పోతోంది. చేనేతే జీవనోపాధిగా బతుకుతున్న కార్మికులను ప్రభుత్వాలు తమ విధానాలతో దుర్భర పరిస్థితుల లోకి నెట్టివేస్తున్నాయి. ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు దేశ చరిత్రలో చేనేతది గర్వించదగిన పాత్రే. జాతీయ ఉద్యమంతో విడదీయరాని అనుబంధం ఆ పరిశ్రమకు ఉంది. మన జాతీయ పతాకంలోని రాట్నంతో అనుబంధం ఆ పరిశ్రమకే సొంతం. కానీ ఇప్పుడు అదంతా గతం. మరమగ్గాలతో మరణ మృదంగం వర్తమానం విసురుతున్న సవాళ్లకు చేనేత పరిశ్రమ తల్లడిల్లిపో తున్నది. ఉపాధి కోల్పోతున్న కార్మికులు ఆదుకోవాలని ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. ఎన్నో పోరాటాలు చేశారు. ఏఒక్కటీ కార్మికుల కడగండ్లు తీర్చలేదు. మారుతున్న కాలం, యంత్రయుగం చేతివృత్తులకు మరణశాసనం లిఖించాయి. ముఖ్యంగా చేనేత రంగంలో ఆకలిచావులు, అనారోగ్య చావులు, అప్పుల ఆత్మహత్యలు నిత్యకృత్యాలుగా మారాయి. మర మగ్గాలు మొత్తం ధ్వంసం చేశాయి. చేనేత సృష్టించుకున్న డిజైన్లను ఏఒక్కటీ వదిలిపెట్టకుండా రాష్ట్రంలో పవర్‌లూమ్స్ కబ్జాచేసి, చేనేతకు కేటాయించిన 11 రకాల రిజర్వేషన్లను ఖాతరు చేయకుండా, నకిలీ వస్త్రాలను మార్కెట్లోకి తెచ్చి చేనేతను చావుదెబ్బ తీస్తున్నా పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు. రిజర్వేషన్ పవర్లూమ్ లాబీ మీద వీరోచిత పోరాటాలు చేసి కొంత కాలం పవర్‌లూమ్స్ ఆడకుండా ఆటకట్టంచి, పోలీసు కేసుల నిర్బంధాల నెదిరించి నిలిచిన ప్రాంతాలు అనంతపురం, ధర్మవరం. అలాంటి చోట్ల కూడా యథేచ్ఛగా చేనేత రకాల తయారీలో పవర్లూమ్ వారిదే విజయం అయింది. అంటే అది ఎంత బలమైన లాబీనో అర్థమవుతుంది. కేంద్ర, రాష్ట్ర చేనేత జౌళి శాఖల మంత్రులుగా ఎందరు వచ్చినా ఈ రంగానికి ఒరిగినదేమీ లేదు. వారందరికీ మరమగ్గాల మీద మమకారమే తప్ప, సమస్యలపై దృష్టి లేదు. కావూరి సాంబశివరావు వ్యవహార శైలి ఇందుకు మంచి ఉదాహరణ. కనీస అవగాహన లేనివారే మంత్రులు కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినదే తడవుగా కావూరి హైదరాబాద్ వచ్చి చేనేతల ప్రతినిధులను, అధికారులను, మంత్రి, ముఖ్యమంత్రులను సమావేశపరిచి కొత్త కొత్త వాగ్దానాలు చేశారు. స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక పథకాలు తెచ్చిపెడతామన్నారు. చివరికి ‘స్వల్పకాలిక’ మంత్రిగా నిలిచారు. రాష్ట్ర సహకార వ్యవస్థలో పెద్ద సంస్థ ‘ఆప్కో’కు కిందటేడాది చైర్మన్‌గా ఎన్నికైన మాజీ మంత్రివర్యులు మురుగుడు హనుమంతరావు, కావూరిని మంగళగిరి తీసుకువచ్చి అట్టహాసంగా చేనేత మగ్గాల షెడ్ల దగ్గరకు తిప్పి చూపించారు. అంతా చూసిన మంత్రిగారు తీవ్రంగా స్పందించి, ‘కాలం మారుతోంది, సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతోంది, పెరిగిన సాంకేతిక నైపుణ్యంతో చేనేత బతుకు సాధ్యం కాదు, ఇన్నాళ్లు బతికించిన చేనేత కార్మికులను అభినందించాలి’ అని ప్రకటించారు. మీ కష్టాలు తీర్చే మార్గాలు చూస్తామని హామీ ఒకటి ఇచ్చారు. యంత్ర పరిజ్ఞానం పెరిగిన ఈ దశలోనే చేనేతకు కేటాయించిన రిజర్వేషన్ చట్టం గట్టిగా అమలు జరపాల్సిన అవసరం ఉంది. చేనేతలు ఎప్పుడు నోరుతెరిచినా, చేయెత్తి నినదించినా రిజర్వేషన్ చట్టం కోసమే కదా! ఇంత ముఖ్యమైన చట్టాన్ని అమలు చేయడం, ఇన్ని అనర్థాలకు కారణమైన నకిలీ వస్త్రాలు నిరోధించడం వంటి అంశాలపై అవగాహన లేకుండా ఎన్ని చెప్పినా చేనేతకు ఒరిగేది ఏం ఉంటుంది? చేనేత పరిశ్రమతో, చేనేత కార్మికుల ప్రమేయంగానీ, ఏమీ లేకుండానే ఆ పరిశ్రమను సమూలంగా సర్వనాశనం చేసే అనేక పథకాలు తెచ్చి పెట్టారు. టెక్స్టైల్ పార్కులు, క్లస్టర్ పథకాలకు కోట్ల రూపాయలు కుమ్మరించి, అది కూడా చేనేతకు చేస్తున్న మేలేనంటున్నారు. రాష్ట్రంలో లక్షల్లో ఉన్న మగ్గాలు వేలల్లోకి ఎందుకు జారిపోతున్నాయో, ఎంతో యోచించి ప్రవేశపెట్టినట్టు చెబుతున్న పథకాల కారణంగానే చేనేత పరిశ్రమ ఎందుకు పతనమైపోతోందో ఏ ఒక్క నాయకుడు కూడా చెప్పరు. హద్దు, అదుపులేకుండా నిబంధనలను ఉల్లంఘించి చిలపల నూలు ధర లనూ, నూలు తయారీని (యాంకీయారన్ ఆబ్లికేషన్) శాసిస్తున్న మిల్లులను ప్రభుత్వాలు పల్లెత్తు మాట కూడా అనలేవు. చేనేతకు అవసరమయ్యే జరీ, రంగులు, రసాయనాలు, పట్టు వంటి సామగ్రి ధరలను అదుపు చేయడం ఎవరికీ సాధ్యం కావడం లేదు. ఇవి చేతకాక పోయినా, కార్మికులలో ఆశలు రేకెత్తించే విధంగా ‘లక్ష రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తామని’ కిరణ్ కుమార్‌రెడ్డి ప్రకటించి సంవత్సరం దాటింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేనేతల వెతలు చూసి రూ.312 కోట్లతో రుణ మాఫీ పథకం ప్రారంభించారు. ఆ పథకం కూడా ఈ పాలకులకు ఆట వస్తువైంది. నూలు మీద ఎన్డీఏ ప్రభుత్వం విధించిన ఎక్సైజ్ డ్యూటీని వైఎస్ రద్దు చేయించడమేకాదు, చేనేత కార్మికులకు యాభై సంవత్సరాల వారికే వృద్ధాప్య పింఛన్లు ఇచ్చి ఆదుకున్నారు. అందరితో పాటు చేనేత వారికి పావలా వడ్డీ పథకాన్ని వర్తింపజేశారు. విచిత్రమేంటంటే, ఆ రుణ మాఫీకి కేటాయించిన రూ.312 కోట్లనే నాలుగు సార్లు చేనేత బడ్జెట్లో చూపించి నేటి పాలకులు తమ పబ్బం గడుపుకొన్నారు. మార్పు పేరుతో విధ్వంసం ఇంత బాగోతం జరిగినా ఇప్పటికీ చేనేతల బతుకులు మారుస్తామనే నాయ కులు ప్రకటిస్తున్నారు. చేనేత అనే పదాన్నీ, మగ్గం స్వరూపాన్నీ మార్చడానికి పూనుకున్నారు. కానీ పాలకుల నోట ‘మార్పు’ అనే మాట వింటేనే చేనేతల నరాల్లో వణుకు పుడుతున్నది. చేనేతను తుడిచి పెట్టడానికి గతంలో జరిగిన అనేక ప్రయత్నాలు ‘మార్పు’ పేరుతోనే చేశారు. ప్రస్తుతం ఉన్న గుంట మగ్గానికి ‘మరలు’ బిగించి శ్రమను తగ్గించాలనీ, తద్వారా ఉత్పత్తి పెంచా లనీ, నైపుణ్యం తగ్గకుండా చూడాలనీ తీయగా వల్లిస్తున్నారు. అంటే చేనేత ఉత్పత్తిని మొత్తం వస్త్ర ఉత్పత్తిలో భాగంగానే పరిగణించాలన్న తమ ఆంత ర్యం ఇలా బయటపెట్టారు. ఈ మాటలు సాధారణంగానే కనిపించినా రిజర్వే షన్ల గోల లేకుండా, చేనేతకు ప్రత్యేక కేటాయింపులు లేకుండా, మరమగ్గాల మీద, మిల్లుల మీద తయారైన నకిలీ వస్త్రాలను చేనేత బట్టలుగానే మార్కెట్ చేయాలన్న దురుద్దేశం ఉంది. ఈ విధానాన్ని చేనేత వర్గాలు తీవ్రంగానే ప్రతిఘటించాయి. ‘హ్యాండ్లూమ్’ విధానాన్ని మార్చడానికి కేంద్రం నియ మించిన ఉన్నతస్థాయి కమిటీలో చేనేత నిపుణులుగానీ, ప్రజా ప్రతినిధులు గానీ లేకుండా అచ్చంగా అధికారులే ఉన్నారంటేనే కుట్ర అర్థమవుతుంది. చేనేతను జౌళి శాఖ నుంచి విడదీసి వేరువేరుగా నిధులు కేటాయించ మనీ, వేరువేరు శాఖలుగా నిర్వహించమనీ, చేనేత తన బతుకు తాను బతు కుతుందనీ ఎప్పటినుంచో మొత్తుకుంటున్నా ప్రభుత్వాలు వినిపించుకో వడం లేదు. అంతరించి పోతున్న చేనేతకు రాయితీలూ, సబ్సిడీలూ వ్యర్థ మని ప్రభుత్వాల అభిప్రాయం. ఇలాంటి విధానాలతో చేనేతను నొప్పి తెలి యకుండా, నిశ్శబ్దంగా పూర్తిగా చంపేయవచ్చునని వారంతా భావిస్తున్నారు. రాజ్యాంగం ప్రసాదిస్తున్న విద్య, వైద్యం, కనీసం గృహవసతి లాంటి సౌక ర్యాలు చేనేతలకు లేవు. ఉపాధి హక్కును కాలరాసి, సంక్షేమ పథకాల పేరుతో దీర్ఘకాలం నుంచి వారిని మభ్యపెడుతున్నారు. చేనేత వర్గాల మౌలిక సమస్యలను తెలుసుకుని, మగ్గమ్మీదే జీవనోపాధి పొంది, కనీస వేతనం లభించే విధంగా విధానాలు రూపొందించే ప్రభుత్వాలు రావాలి. చేనేత పరిశ్రమ నిలవాలి. - (వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం పూర్వ అధ్యక్షుడు) అందె నరసింహారావు