జిల్లాలో గాలివాన
కంగ్టి/కల్హేర్/తడ్కల్, న్యూస్‌లైన్: జిల్లాలో గురువారం సాయంత్రం పలుచోట్ల అకాల వర్షం కురిసింది. కంగ్టి, కల్హేర్, తడ్కల్‌లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. కంగ్టి పరిసర ప్రాంతాల్లో సాయంత్రం ఉన్నట్టుండి ఒకేమారు ఈదురు గాలులు వీయడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కంగ్టిలోని కొందరి ఇంటి పైకప్పు రేకులు గాల్లో ఎగిరి కింద పడిపోయాయి. స్థానిక సిద్ధేశ్వర ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకొని కాలి నడక వస్తున్న భక్తులు గాలి వాన బీభత్సానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
తడ్కల్‌లో వడగళ్ల వర్షం
కంగ్టి మండలం తడ్కల్ పరిధిలోని బాన్సువాడ, తడ్కల్, దామర్‌గిద్దా,ముర్కుంజాల్, చాప్టా తదితర గ్రామాల్లో వడగళ్ళుతో కూడిన వర్షం కురిసింది. దీంతో శనగ,కంది పంటల రాసులు చేస్తున్న రైతులకు కొంత మేర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మామిడి చెట్లకు పూసిన పూత వర్షం, వడగళ్ళ తాకిడికి రాలినట్లు అయా గ్రామాల రైతులు తెలిపారు.
కల్హేర్‌లో..
మండల కేంద్రమైన కల్హేర్‌లో గురువారం రాత్రి ఓ మోస్తరుగా వర్షం కురిసింది. పొద్దుపోయే వేళ ఈదురుగాలులు వీచాయి. ఉరుములు మెరుపులతో వర్షం కురువడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సివచ్చింది. మహశివరాత్రి పర్వదినం సందర్భంగా మందిరాలకు వెళ్లిన భక్తులు.. ఒక వైపు వర్షం, మరోవైపు కరెంట్ సరఫరా లేకపోవడంతో ఇక్కట్లపాలయ్యారు.