థాయ్లాండ్ పార్లమెంట్ రద్దు
బ్యాంకాక్: థాయ్లాండ్ తీవ్ర ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న ప్రధాని యింగ్లుక్ షినవత్ర దిగివచ్చారు. పార్లమెంటును రద్దు చేస్తున్నట్టు నేడు ప్రకటించారు. సాధారణ ఎన్నికలు జరిపించేందుకు తేదీని త్వరలో ప్రకటిస్తామని టీవీ ద్వారా చేసిన ప్రసంగంలో తెలిపారని జిన్హువా వార్తా సంస్థ పేర్కొంది. పార్లమెంటును రద్దు నిర్ణయానికి రాజకుటుంబం ఆమోదం తెలపాల్సివుంది. 2011, ఆగస్టులో తాను పదవి చేపట్టిన నాటి నుంచి దేశాన్ని సామాజిక సంక్షోభం నుంచి బయటపడేందుకు పాటుపడ్డానని షినవత్ర పేర్కొన్నారు.
పార్లమెంటును రద్దు చేసి 60 రోజుల్లో తిరిగి ఎన్నికలు జరిపేందుకు షినవత్ర ఆదివారం సంసిద్ధత వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీల ఎంపీలంతా పదవులకు రాజీనామా చేసి దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొనాలని నిర్ణయించడం, తనను గద్దె దింపేందుకు ఆందోళనకారులు సోమవారం దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల ముట్టడికి సిద్ధమవడం వంటి కారణాల నేపథ్యంలో షినవత్ర ఈ నిర్ణయం తీసుకున్నారు.