ముంబైలో భారీగా బంగారం చోరీ
ముంబై సెంట్రల్, న్యూస్‌లైన్: ఎప్పుడూ ఆ ప్రాంతం రద్దీగా ఉంటుంది. పైగా పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలోనే ఉంది. అయినా దొంగలు పట్టపగలే ఓ నగల దుకాణంలో సుమారు ఎనిమిదిన్నర కిలోల బంగారం దోచుకెళ్లిపోయారు. దీని విలువ సుమారు రూ. 2.5 కోట్లుగా అంచనా వేశారు. ఈ ఘరానా దోపిడీ ముంబైలోని డోంబివలీలో ఉన్న రాజ్త్న్ర జ్యూయలర్స్‌లో శుక్రవారం జరిగింది. అక్షయ తృతీయ సందర్భంగా కొత్త నగల్ని యజమాని భరత్ జైన్ షాపులో అమ్మకానికి పెట్టారు. మధ్యాహ్నం భోజనానికి దుకాణాన్ని మూసి ఇంటికెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు షాపునకు కన్నం చేసి లోపలికి ప్రవేశించి బంగారాన్ని దోచుకెళ్లారు. దుకాణంలో నాలుగురోజుల్నుంచి సీసీటీవీలు పనిచేయట్లేదని యజమాని పేర్కొన్నారు. దీంతో ఇది తెలిసున్న వారి పనే అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.