భద్రాచలంలోని రామాలయంలో దొంగెవరు?
ఆభరణాలు అమెరికాకు అమ్మేయత్నం..?
మీడియా ప్రచారంతో బెడిసికొట్టిన వ్యూహం
కీలకంగా వ్యవహరించిన ఇద్దరు అర్చకులు
బయట పెళ్లిళ్లకు స్వామివారి ఆభరణాలు
వారి తీరుపై గుర్రుగా ఉన్న మిగతా అర్చకులు
నగల మాయం కేసులో అంతా గప్‌చుప్
‘ఇంటి దొంగను ఈశ్వరుడెరుగడు’ అన్న చందంగా మారింది రామాలయంలో నగల మాయం వ్యవహారం. ఆభరణాలు దొరికినా వాటిని ఎవరు అపహరించుకెళ్లారనేది నిర్ధారణ కాకపోవడం.. అప్పుడే ఆ కేసును నీరుగార్చే ప్రయత్నాలు మొదలవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆభరణాలను అమెరికాకు అమ్మే యత్నంలో భాగంగానే మాయం చేశారనే అపవాదు ఉంది. బయట పెళ్లిళ్లకు కూడా వీటిని వినియోగించినట్లు ప్రచారం సాగుతోంది. ఈ సందేహాలన్నింటినీ నివృత్తి చేయాల్సిన పోలీసులు .. అంతా గప్‌చుప్ అనే రీతిలో వ్యవహరిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి.
భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో మాయమైన బంగారు నగలు దొరికినా కేసు మిస్టరీగానే మిగిలింది. ఆలయంలోని కొంతమంది అర్చకులే వీటిని మాయం చేశారనే ప్రచారం దాదాపు నిజమైనప్పటికీ.. ఆ ఇంటి దొంగలు ఎవరనేది మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం రామాలయ చరిత్రలోనే ఇదో మాయని మచ్చగా మిగలనుంది. కానీ ఈ ఘటనపై దేవాదాయశాఖ ఉన్నతాధికారులు అంతగా స్పందించకపోవటం పట్ల ఏదో మతలబు దాగి ఉందనే ప్రచారం సాగుతోంది. అర్చకత్వమే జీవిత పరమావధిగా, రాముడి సేవలో తరిస్తున్న కొంతమంది అర్చకులను ఈ పరిణామాలు తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయి.
అమెరికాకు అమ్మేందుకేనట!
సీతమ్మ పుస్తెల తాడు, లక్ష్మణ స్వామి లాకెట్ మాయం వెనుక మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికాకు తరలించే ప్రయత్నంలోనే ఆ రెండు బంగారు ఆభరణాలను మాయం చేశారనే కొత్తవాదన వినిపిస్తోంది. భద్రాచలం రామాలయంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలించిన వారంతా, ఇందులో వాస్తవాలు లేకపోలేదంటున్నారు. వైదిక కమిటీ సమ్మతించిందనే నెపంతో అమెరికాకు ఉత్సవ విగ్రహాలను అమ్మకానికి పెట్టగా, దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో ఇక్కడి అధికారులు ఆ ప్రయత్నాలు విరమించుకున్నారు. ఇటీవల అమెరికాలోని ఓ ఆధ్యాత్మిక సంస్థ భద్రాచలం వచ్చిన సందర్భంలో కల్యాణమూర్తులపై ఉన్న బంగారు ఆభరణాలకు బేరం కుదుర్చుకున్నారని, ఈ వ్యవహారంలో దేవస్థానంలోని ఓ అర్చకుడు ‘ప్రధాన’ భూమిక పోషించారని ప్రచారం జరుగుతోంది. సీతమ్మవారి మంగళసూత్రం, లక్ష్మణస్వామి లాకెట్ ఇస్తే.. ప్రతిఫలంగా భారీ నజరానాలు సమర్పిస్తామనే ఒప్పందం జరిగినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాటి స్థానంలో వేరే వాటిని తయారు చేయించి, యథాస్థానంలో పెట్టేందుకు వ్యూహం పన్నగా, ఇంతలోనే దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో ఆ ప్రయత్నాలు ఫలించలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. బంగారు నగలు మాయం చేసిన కేసులో దోషులెవరనేది తేల్చకుండా, దేవాదాయశాఖ ఉన్నతాధికారులు ఈ కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తుండటంపై కూడా అనుమానాలు వస్తున్నాయి.
గుడి బయటకు నగలు
ఇతర ప్రాంతాల్లో జరిగే వేడుకలకు తమ ఇళ్లలో ఉండే విగ్రహాలను తీసుకెళ్లి, అవే భద్రాద్రి సీతారాముల విగ్రహాలుగా భ్రమింపజేసి దేవస్థానం అర్చకులు కొందరు పెద్ద ఎత్తున సొమ్ము చేసుకోవటంపై గతంలోనే పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఇలా బయట పెళ్లిళ్లకు కూడా స్వామివారి ఆభరణాలను తీసుకెళ్తుంటారని, ఈ క్రమంలోనే నగలు మాయమయ్యాయనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. గతంలో ఈఓగా పనిచేసిన కూరాకుల జ్యోతి ఇటువంటి చర్యలపై తీవ్రంగానే స్పందించారు. సీతారాముల విగ్రహాలను ఓ అర్చకుడు కారులో హైదరాబాద్‌కు తీసుకెళ్తుండాన్ని స్వయంగా చూసిన ఆమె, అతనికి మెమో జారీ చేశారు. ఇటువంటి వాటికి ఆమె ఉన్న కాలంలో అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు జరిగాయి. ఆమె ఇక్కడి నుంచి బదిలీ అయిన తరువాత పూర్తి స్థాయి కార్యనిర్వహణాధికారి లేకపోవటం, డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న రమేష్‌బాబు ఇక్కడ ఇన్చార్జి ఈఓగా వ్యవహరిస్తుండటంతో పూర్తిస్థాయిలో ఆలయ పాలనపై దృష్టి సారించలేకపోతున్నారు. ఇదే అవకాశంగా భావించి కొంతమంది అర్చకులు అసలు కంటే కొసర (జీతం కంటే బయట పెళ్లిళ్లలో వచ్చే డబ్బులు)పైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
అర్చకులపై చర్యలేవి?
భద్రాద్రి రామాలయ ప్రతిష్టను దిగజార్చేరీతిలో వ్యవహరించిన అర్చకులపై చర్యలు తీసుకోవడంలో దేవాదాయశాఖ అధికారులు వెనుకంజ వేస్తుండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గర్భగుడిలో బీరువా, లాకర్లలోనే బంగారు ఆభరణాలు భద్రపరుస్తారు. వాటిని తొమ్మిది రోజుల పాటు అర్చకులంతా కళ్లు కాయలు చేసుకొని వెతికినా కనిపించలేదు. చివరికి ఎలా వచ్చాయనే దానిపై ఆరా తీయకపోవడాన్ని భక్తులు తప్పుపడుతున్నారు. ఇంతకీ బంగారు ఆభరణాలు తీసిందెవరనేది మిస్టరీగానే మిగిలిపోయింది. ఇంటి దొంగలెవరనేది బయట పెట్టకపోతే రామాలయంలో ఉండే అర్చకులందరిపైనా అపవాదు ఉండే అవకాశం ఉందని కొందరు అర్చకులు వాపోతున్నారు.
ఆరోపణలున్నవారందర్నీ బదిలీ చేస్తాం: రమేష్‌బాబు, ఈఓ
బంగారు ఆభరణాలు మాయమైన నేపథ్యంలో బాధ్యులైన అర్చకులందర్నీ రాష్ట్రంలోని వేర్వేరు ఆలయాలకు బదిలీ చేస్తాం. ఆభరణాలు అమ్మకం విషయం నా దృష్టికి రాలేదు. ఆలయ చరిత్రకు మచ్చతెచ్చే విధంగా జరిగిన ఈ ఘటనపై దేవాదాయశాఖ సీరియస్‌గానే ఉంది. దీనిపై సమగ్ర నివేదిక కూడా కోరాం. రెండు, మూడురోజుల్లో కమిషనర్‌ను కలుస్తాం. అర్చకులను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తాం.