ఎర్రచందనం దుంగలు స్వాధీనం
నందలూరు: నందలూరు మండలంలోని సోమశిల వెనుక జలాలవద్ద పాత తిమ్మరాజుపల్లె గ్రామం మొండిగోడల వద్ద దాచి ఉన్న ఐదు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఇన్చార్జి ఎస్ఐ ధనుంజయుడు తెలిపారు. బుధవారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తిరుపతి టాస్క్‌ఫోర్స్ వారి సమాచారంతో రాజంపేట డీఎస్పీ రాజేంద్ర ఆదేశాలమేరకు బుధవారం తెల్లవారుజామున పాత తిమ్మరాజుపల్లెలోదాడులు నిర్వహించగా నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు తమపై రాళ్లు రువ్వుతూ పారిపోవడానికి ప్రయత్నించారన్నారు. వారిలో పొత్తపి గ్రామానికి చెందిన ఈగా పెంచల్‌రెడ్డి, చుక్కాయపల్లె గ్రామానికి చెందిన చుక్కా వెంకటరమణ, కోనేటి శ్రీనివాసులును అదుపులోకి తీసుకోగా పొత్తపికి చెందిన వెంకటరమణారెడ్డి పారిపోయాడన్నారు. అరెస్టుచేసిన వారిని నందలూరు కోర్టులో హాజరుపరుచగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించినట్లు తెలిపారు. ఈ దాడులలో కోర్టు కానిస్టేబుల్ హేమాద్రి, సుధాకర్‌రెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.