thirucchi
-
చిందేశారు.. బుక్కయ్యారు
సాక్షి, చెన్నై : తిరుచ్చి కేంద్ర కారాగారంలో భద్రతా విధుల్లో ఉన్న ప్రత్యేక పోలీసులు అడ్డంగా బుక్కయ్యారు. బదిలీ ఉత్తర్వులు ఆనందంతో చిందేశారు. ఈ వీడియో వైరల్ అవడంతో బదిలీ ఉత్తర్వులు ఆగాయి. తిరుచ్చి కేంద్ర కారాగారంలో భద్రతా విధుల్లో వంద మంది పోలీసులు ఉన్నారు. ఇందులో 20 మంది యువకులు ఉన్నారు. తాము ఇక్కడ పనిచేయలేమని, కోరిన చోటుకు దయచేసి బదిలీ చేయాలని పలుమార్లు జైళ్లశాఖ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఎట్టకేలకు ఈ 20 మందిని వారు ఆశించిన ప్రాంతాలకు పంపించేందుకు జైళ్లశాఖ నిర్ణయించింది. వీరిని బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీఅయ్యాయి. ఈ ఆనందాన్ని పట్టలేక ఆ యువకులు కేరింతలు కొట్టారు. తమ నివాసం ఉన్న క్వార్టర్స్ పరిసరాల్లో మోటారు సైకిళ్లు ఎక్కి చక్కర్లు కొట్టారు. చిందులేస్తూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. తిరుచ్చితో తమ బంధం వీడిందని నినాదాల్ని హోరెత్తించారు. అర్ధరాత్రి వేళ క్వార్టర్స్‌లో ఈ యువ పోలీసుల చిందుల్ని ఎవరో తమ స్మార్ట్ ఫోన్లలో వీడియో చిత్రీకరించారు. ఆనందంతో వీరు కొడుతున్న కేరింతల వీడియో వైరల్‌గా మారింది. ఇది ఉదయాన్నే జైళ్ల శాఖ ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. వారి బదిలీ ఉత్తర్వులు ఆగాయి. విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ యువకులు తీవ్ర మనో వేదనలో పడ్డారు. ఆనందంతో చిందేసి.. చివరకు అడ్డంగా బుక్కయ్యామన్న వేదనతో ఆ వీడియో చిత్రీకరించిన వారికి శాపనార్థాలు పెట్టే పనిలో పడ్డారు. -
పసివాడి ప్రాణం తీసిన రూ.70 వివాదం
సాక్షి, చెన్నై: ఇద్దరు వ్యక్తుల మధ్య నెలకొన్న కేవలం రూ.70 వివాదం పసిబిడ్డ ప్రాణాలను హరించిన దుర్ఘటన తిరుచ్చిరాపల్లిలో చోటుచేసుకుంది.తిరుచ్చిరాపల్లి జిల్లా తొట్టియం సమీపం కల్లుపట్టికి చెందిన రంగర్ అనే వ్యక్తి నిదీశ్వరన్ అనే తన 15 నెలల బాబును ఎత్తుకుని ఆదివారం రాత్రి రోడ్డులో నిలబడి స్నేహితులతో పిచ్చాపాటి మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో అదే ప్రాంతానికి చెందిన సెంథిల్ వీరి వద్దకు వచ్చి ఆనంద్ అనే వ్యక్తి జేబులో చేయిపెట్టి రూ.70 తీసుకునేయత్నం చేశాడు. దీంతో రంగర్ కలుగజేసుకుని సెంథిల్‌ను నిలదీశాడు. దీంతో రంగర్, సెంథిల్ మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఇందుకు ఆగ్రహించిన సెంథిల్ సమీపంలో ఉన్న దుడ్డుకర్రను తీసుకుని రంగర్ తలపై కొట్టబోగా అతడు పక్కకు తప్పుకోవడంతో పసిబాలుడి తలకు దెబ్బ తగిలింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. నిందితుడు సెంథిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
మహిళా దినోత్సవం నాడు ఇంత దారుణమా?
సాక్షి, చెన్నై : ఓ వైపు ప్రపంచమంతా మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే.. మరోవైపు ట్రాఫిక్ పోలీసుల దాష్టికానికి ఓ నిండు గర్భిణీ మృతి చెందింది. ఈ ఘటన తమిళనాడును దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన నేపథ్యంలో ప్రముఖ నటి గౌతమి గురువారం దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాధిని దర్శించుకొని నివాళులర్పించారు. గర్భిణీ మృతి ఘటనపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తిరుచ్చిలో పోలీసుల తీరుతో నిండు గర్భిణి మృతి చెందడం తనను కలిచి వేసిందని ఆమె అన్నారు. మహిళా దినోత్సవం రోజునే ఇలాంటి దారుణం జరగడం సమాజానికి సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుచ్చిలోని గణేష్ సర్కిల్ వద్ద పోలీసులు ట్రాఫిక్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో సూలపేటకు చెందిన రాజా, అతని భార్య ఉష బైక్‌పై వెళ్తున్నారు. వారి వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు నిలిపే ప్రయత్నాం చేశారు. కానీ రాజా బైక్ ఆపకుండా వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు మరో వాహనంలో వారిని వెంబడించారు. బైక్ వెనుక కూర్చున్న ఇన్స్పెక్టర్ వాహనాన్ని బలంగా తన్నాడు. ఇన్స్పెక్టర్ కాలు గర్భిణీ పొట్టపై బలంగా తాకడంతో దంపతులిద్దరూ వాహనం నుంచి నడిరోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో ఉషకు తీవ్ర గాయాలు కావటంలో అక్కడే మృతిచెందగా, భర్తకు తీవ్ర గాయలయ్యాయి. -
నేడు చెన్నైకి మోడీ రాక
భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొనేందుకు ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ శనివారం చెన్నైకి రానున్నారు. నగర శివారులోని వండలూరులో జరగనున్న ప్రచార సభలో మోడీ ప్రసంగించనున్నారు. దీని కోసం పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: దేశంలో ఎన్నికల వేడి రాజుకోకముందే గత ఏడాది ఆగస్టులో తిరుచ్చిలో నిర్వహించిన సభలో మోడీ చేసిన ప్రసంగం దేశవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేసింది. ఆ తరువాత మరోసారి మోడీ చెన్నైకి వచ్చారు. ఈక్రమంలో రాష్ట్రంలో పార్టీ బాగా పుంజుకుంది. మరో నెలరోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న తరుణంలో జరుపుతున్న సభ కావడం తో బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది. వంద ఎకరాల సువిశాల స్థలంలో 160 అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పుతో పార్లమెంటు భవనం నమూనాతో స్టేజీ ఏర్పాటు చేశారు. పదిలక్షల మంది సభకు హాజరుకాగలరని అంచనావేస్తున్నారు. భారీ ఎల్ఈడీ స్క్రీన్లు పది ఏర్పాటు చేశారు. 40 వేల వాహనాలు పార్కింగ్ చేసేందుకు వీలుగా 13 చోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటుచేశారు. తీవ్రవాదుల హెచ్చరిక-భారీ భద్రత నరేంద్రమోడీని తీవ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే హెచ్చరించి ఉన్నందున భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న తీవ్రవాదుల వల్ల మోడీకి ముప్ప పొంచి ఉందని అనుమానిస్తున్నారు. పాత ఎయిర్‌పోర్టులో ప్రత్యేక విమానంలో మోడీ దిగినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు ఆయన చుట్టూ ఐదంచెల భద్రత అమల్లో ఉంటుంది. సభ జరుగుతున్నంత సేపు ఆకాశమార్గాన హెలికాప్టర్ చక్కర్లు కొడుతూ పర్యవేక్షించే ఏర్పాట్లు చేశారు. శుక్రవారం రాత్రి 7 గంటలకే పోలీసులు సభా ప్రాంగణాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. నగర కమిషనర్ జార్జ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ బందోబస్తు ఏర్పాట్లను తనిఖీ చేశారు. మోడీ సభకు ప్రజలను ఆకర్షించేలా పార్టీ నేతలు తాంబరంలో శుక్రవారం నమో టీ స్టాల్‌ను ఏర్పాటు చేసి ఉచితంగా అందజేశారు. సభ ముగిసిన వెంటనే మోడీ నగరంలోని ఐటీసీ గ్రాండ్ చోళాలో బస చేస్తారు. శనివారం ఉదయం ఎస్ఆర్ఎమ్ వర్సిటీలో జరిగే స్నాతకోత్సవంలో మోడీ పాల్గొంటారు. బీజేపీపై కుట్ర : పొన్ వివిధ ప్రాంతీయ పార్టీల కూటములతో భారతీయ జనతా పార్టీ విజయవంతంగా ముం దుకు వెళుతుండగా చూసి ఓర్వలేని కొందరు తమపై కుట్రపన్నుతున్నారని రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ ఆరోపించారు. డీఎంకేతో తాము పొత్తు చర్చలు సాగిస్తున్నామని, ఈ కారణంగా కినుక వహించిన నరేంద్రమోడీ ఈనెల ఎనిమిదో తేదీన వండలూరులో జరిగే సభకు హాజరుకావడం లేదన్న దుష్ర్పచారం చేస్తున్నారని ఆయన అన్నారు. పొత్తు చర్చలు జరగనేలేదంటూ కొందరు ఉద్దేశపూర్వకంగా సృష్టిస్తున్న వదంతులను నమ్మరాదని ఆయన పిలుపునిచ్చారు.