జాతీయ రాజధానిలో క్రిస్మస్ సంబరాల సందడి
న్యూఢిల్లీ: క్రిస్మస్ సంబరాల సందడిలో జాతీయ రాజధాని తలమునకలయ్యింది. మంగళవారం రాత్రికే చర్చిలను అలంకరించిన క్రైస్తవులు బుధవారం ఉదయం లేచింది మొదలు వణికించే చలిలోనే ఆత్మీయులకు అభినందనలు తెలపడానికి ప్రార్థనా మందిరాలకు బయలుదేరారు. ‘‘ఈ పండుగ ప్రజలందరిదని నా విశ్వాసం. ఇక్కడ చర్చిలో అన్ని విశ్వాసాలకు చెందిన వారున్నారు. ఇది మతం, సంస్కృతుల సమ్మేళన పర్వదినం’’ అని వివరించాడు 23 ఏళ్ల థామస్ ఫిలిప్స్.
మధ్య ఢిల్లీ కన్నాట్‌ప్లేస్‌లోని సేక్రెడ్ హార్ట్ చర్చిలో ప్రార్థనకు హాజరయిన ఫిలిప్స్ కొవ్వొత్తులు, కరోల్స్‌తో కనిపించాడు. ‘‘క్రిస్మస్ పర్వదినం అంటేనే కరోల్స్, కేక్‌లు, పార్టీలు. ఇక ఆత్మీయులకు బహుమతుల పంపిణి అనేది ఓ అదనపు ఆకర్షణ’’ అని వివరించాడు. మధ్య ఢిల్లీలోని కరోల్‌బాగ్ బాప్టిస్ట్ చర్చికి వచ్చిన జార్జ్ కుట్టీ (51) మాట్లాడుతూ ‘‘కుటుంబం, సన్నిహితులతో పాటు సమస్త లోకం బాగుండాలని జీసస్‌ను ప్రార్థించాను. ఈ రోజు మానవాళి శాంతి కోసం తపించిన జీసస్ జన్మదినం. కాబట్టి ప్రపంచమంతటికీ ఈ రోజు పర్వదినమే’’ అని వివరించారు. మంగళవారం అర్థరాత్రి జీసస్ జన్మించాడని విశ్వాసం.
పపంచ వ్యాప్తంగా క్రిస్టియన్లకు అతి పెద్ద ఆనందపు వేడుక. నగరంలోని పలు దుకాణాలు వివిధ రకాల కేకులు, వివిధ రకాల ఎండు పండ్లతో నిండిపోయాయి. రమ్ కలిపి చేసిన కేకులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దక్షిణ ఢిల్లీలోని ఆర్కే పురానికి చెందిన అనితా వర్గీస్ (42) మాట్లాడుతూ ‘‘ ప్రతి క్రిస్మస్కు బంధుమిత్రులతో ఇల్లు సందడిగా మారుతుంది. టర్కీ కోళ్ల వేపుడు, కోడి మాంసం, ప్లమ్ కేకులు, ముఫిన్స్ సిద్ధం చేసి ఉంచుతాను. పర్వదినం సందర్బంగా భారీ వేడుకను జరుపుకుంటాము. నగరంలోని పలు క్లబ్‌లు, రెస్టారెంట్లు ప్రత్యేకంగా క్రిస్మస్ విందులకు ఏర్పాట్లు చేస్తున్నాయి. విందులు ఏర్పాటు చేసుకునే వారికి ప్రత్యేక తగ్గింపు అందిస్తున్నాయి.