అత్యాచారం చేశాడు
సినీ నిర్మాతపై ముంబై యువతి ఆరోపణ
బళ్లారి టౌన్ : సినీ నిర్మాత, రియల్ ఎస్టేట్ యజమాని గోవర్ధనమూర్తి తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని ముంబైకి చెందిన 20 ఏళ్ల యువతి ఆరోపించారు. బళ్లారి నగరంలో మానవ హక్కుల అసోసియేషన్ కార్యాలయంలో ఇంటర్నేషనల్ మానవ హక్కుల ఆర్గనైజేషన్ రాష్ట్ర చైర్మన్ వీ మమత సమక్షంలో విలేకరుల సమావేశంలో ఆమె బుధవారం మాట్లాడారు.
‘ నేను గతంలో ముంబైలోని డెంటల్ క్లీనిక్‌లో రిసెప్షనిస్ట్‌గా పని చేసేదాన్ని. అక్కడి జీతం చాలక పోవడంతో స్నేహితుల సహాయంతో బెంగళూరులోని రిచ్మండ్ సర్కిల్లో థోఫాజ్ బార్లో బార్ గర్ల్‌గా చేరాను. ఆ హోటల్‌కు వస్తున్న సినీ నిర్మాత గోవర్ధమూర్తి నన్ను గన్‌తో బెదిరించి నెలలో నాలుగు సార్లు అత్యాచారం చేశాడు. ఆయనకు బార్లో పని చేసే సురేష్, రితేజ్ అనే వ్యక్తులు సహకరించారు.
ఈనెల 2వ తేదీన కూడా నాపై అత్యాచారం చేశాడు. భరించలేక ఈనెల 5న మానవ హక్కుల ఆర్గసైజేషన్ అధ్యక్షురాలు మమతకు ఫోన్ చేసి సమస్య చెప్పుకున్నాను. నాకు జరిగిన అన్యాయం బారుల్లో మరెవరికి జరగరాదని మీడియా ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాను. నాపై అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించండి’ అని డిమాండ్ చేశారు. అనంతరం ఎస్పీ కార్యాలయం వెళ్లి ఎస్పీ చేతన్ సింగ్ రాథోడ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సమావేశంలో మానవహక్కుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు సురేష్‌రెడ్డి, రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సత్యదూరం : గోవర్ధనమూర్తి
ఈ విషయంపై సినీ నిర్మాత గోవర్ధనమూర్తి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆ అమ్మాయి చేస్తున్న ఆరోపణలు సత్యదూరం. నేను ఆ బారుకు స్నేహితులతో కలిసి వెళ్లే వాడిని.. కానీ ఆ అమ్మాయి ఎవరో తెలీదు. నా పేరు ప్రతిష్టను దెబ్బతీయాలనే ఎవరో కుట్ర పన్నారు. దీనిపై కోర్టుకు వెళ్తా’ అని తెలిపారు.