ఫ్యాక్షన్‌ను ప్రోత్సహిస్తే చూస్తూ ఊరుకోం
ధర్మవరం : ‘అధికార పార్టీ నాయకుల ఆగడాలు అడ్డుకుంటాం. అలాగని ఫ్యాక్షన్‌ను ప్రోత్సహిస్తామంటే చూస్తూ ఊరుకోమని’ వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా కనగానపల్లి మండలం యలక్కుంట్లలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహావిష్కరణకు వెళ్లిన ఆయనపై అక్రమ కేసులు బనాయించారు. ఈ కేసులో ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పొంది, జామీన్లను అందజేసేందుకు ధర్మవరం కోర్టుకు శుక్రవారం వచ్చారు. రాప్తాడు, ధర్మవరం నియోజవకర్గాలకు చెందిన పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కోర్టు వద్దకు చేరుకున్నారు.
న్యాయమూర్తికి జామీన్లు అందజేసిన అనంతరం తోపుదుర్తి మీడియాతో మాట్లాడారు. నాలుగునెలల వ్యధిలోనే మూడు అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. టీడీపీ నాయకులు చట్టాలను చేతిలోకి తసుకుని, అధికారులను శాసిస్తున్నారని, పోలీసులు ఉన్నతాధికారులను మంత్రుల అనుచరులు, వారి డ్రైవర్లు కూడా బెదిరిస్తున్నారన్నారు. తమ దందాలకు వంతపాడాలని ఒత్తిడికి గురిచేస్తూ నీతి నిజాయితీగా పనిచేసే అధికారులను కూడా నిస్సహాయస్థితిలోకి నెట్టివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజశేఖరరెడ్డి హయంలో జిల్లాలో ఫ్యాక్షన్‌ను సమూలంగా నిర్మూలించేందుకు స్టీఫెన్ రవీంద్ర లాంటి నిజాయితీగల ఆఫీసర్లను నియమించారని తెలిపారు. అధికార పార్టీ నాయకులు కేబుల్ సంస్థలను గుప్పెట్లో పెట్టుకుని తమకు వ్యతిరేకంగా ప్రసారం చేసే ఛానళ్ల ప్రసారాలు నిలిపివేయడం దారుణమన్నారు. మీడియా ప్రతినిధులు కూడా ప్రజల పక్షాన నిలిచి వారి సమస్యలను పరిష్కరించేలా వ్యవహరించాలి కానీ, వ్యక్తులను ఆరాధించడం.. వారిని హీరోలుగా చిత్రీకరించడం తగదన్నారు. కౌన్సిలర్ నారాయణరెడ్డి, జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, రాప్తాడు, సీకేపల్లి, మండల కన్వీనర్లు రామాంజినేయులు, గోవిందరెడ్డి, కనగానపల్లి జెడ్పీటీసీ సభ్యుడు ఈశ్వరయ్య పాల్గొన్నారు.