తోట సీతారామలక్ష్మి నివాసాన్ని ముట్టడించిన టీడీపీ కార్యకర్తలు!
భీమవరం: సీట్లు ఆశించి భంగపడ్డ తెలుగు తమ్ముళ్ల నిరసన జోరు పెరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఇంటిని టీడీపీ కార్యకర్తలు ముట్టడించారు. తలపూడి శివరామరాజుకు సీటు కేటాయించాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండీ అసెంబ్లీ సీటును తలపూడి శివరామరాజుకు కేటాయించాలంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అయితే మీ డిమాండ్ ను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని సీతారామలక్ష్మి కార్యకర్తలను బుజ్జగించారు.
ఇంకా జిల్లాలోని కొవ్వూరు, గోపాలపురం, చింతలపూడి, నరసాపురం, ఉంగుటూరు నియోజకవర్గాలను ఎవరికిస్తారనే దానిపైనా స్పష్టత రాలేదు. దీంతో టీడీపీ నేతలెవరికీ సీటు ధీమా కనిపించడం లేదు. తమ పేర్లు జాబితాలో ఉంటాయో లేదోననే ఉత్కంఠ వారిలో కనిపిస్తోంది. ఈ కారణంగానే నేతలు నామినేషన్ల గురించి ఆలోచించే పరిస్థితి లేకుండా పోయింది.