వేయిపడగలు.. వెయ్యేళ్ల విజ్ఞానం
సీనియర్ పాత్రికేయుడురాఘవాచారి
ఘనంగా విశ్వనాథసత్యనారాయణ జయంతి వేడుకలు
విజయవాడ కల్చరల్ : వేయిపడగలు నవల వెయ్యేళ్ల విజ్ఞానాన్ని కలిగిస్తుందని సీనియర్ పాత్రికేయుడు సి.రాఘవాచారి పేర్కొన్నారు. మహాకవి విశ్వనాథ సత్యనారాయణ 120వ జయంతిని పురస్కరించుకుని కృష్ణాజిల్లా రచయితల సంఘం, ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, సిద్ధార్థ కళాశాల తెలుగు శాఖ గురువారం నిర్వహించిన జాతీయ సాహిత్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాఘవాచారి ప్రసంగించారు. అనంతరం శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ విశ్వనాథ జాతీయ కవి అని, ఆయన సాహిత్యం ఒక తరంలో ప్రభంజనం సృష్టించిందన్నారు. విశ్వనాథ ఫౌండేషన్ నిర్వాహకుడు ఆచార్య డాక్టర్ వెలిచల కొండలరావు మాట్లాడుతూ కవికి భాషా బేధాలు ఉండకూడదని, వారి సాహిత్యం విశ్వమానవ ప్రేమను కోరుకోవాలన్నారు. విశ్వనాథ తన సాహిత్యం ద్వారా అదే పనిచేశారని చెప్పారు. విశ్వనాథ మనవడు విశ్వనాథ సత్యనారాయణ మాట్లాడుతూ విశ్వనాథ సంపూర్ణ సాహిత్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.
ఆయన నివాసాన్ని స్మృతి కేంద్రంగా మారుస్తున్నామని చెప్పారు. ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ ప్రధాన కార్యదర్శి గోళ్ల నారాయణరావు, సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీఎస్ పద్మారావు, కళాశాల సంచాలకుడు వేమూరి బాబూరావు ప్రసంగించారు. కృష్ణాజిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు సభకు అధ్యక్షత వహించారు. జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి జీవీ పూర్ణచందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కవి, రచయిత చలపాక ప్రకాష్ రచించిన ‘ఆధునిక తెలుగు అడుగుజాడలు’ సాహిత్య గ్రంథం, ఎంవీఆర్ సత్యనారాయణమూర్తి రచించిన ‘నందిని నందివర్థనం’ కథా సంపుటిని బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు.
పరిశోధనా పత్రాల సమర్పణ
విశ్వనాథ సాహితీ వైభవం పేరిట జరిగిన సభలో ‘ప్రకృతి పరిరక్షణ-విశ్వనాథ వారి భావజాలం’డాక్టర్ కె.రామకృష్ణ, విశ్వనాథవారి ఆంధ్రాభిమానంపై డాక్టర్ ద్వానాశాస్త్రి, రామాయణ కల్పవృక్షంపై డాక్టర్ కోడాలి సోమసుందరరావు, మరో 40మందికిపైగా పరిశోధనా పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమాలను మద్రాస్ తెలుగు విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ మాడభూషి సంపత్‌కుమార్, శతాధిక గ్రంథకర్త ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య, బూడాటి వెంకటేశ్వర్లు, చేకూరి సుబ్బారావు అధ్యక్షత వహించారు.
అభిమానుల పుష్పాంజలి
ఈ సందర్భంగా గురువారం ఉదయం లెనిన్సెంటర్లోని విశ్వనాథ విగ్రహం వద్ద మండలి బుద్ధప్రసాద్, పరవస్తు చిన్నయ్యసూరి కళాపీఠం అధ్యక్షుడు టి.శోభనాద్రి, తెలుగు అధ్యాపకుడు గుమ్మా సాంబశివరావు, ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు గోళ్ల నారాయణరావు, కవి, రచయిత ద్వానా శాస్త్రి, చలపాక ప్రకాష్, ఆచార్య వెలమల సిమ్మన్న, కృష్ణాజిల్లా రచయితల సంఘం వ్యవస్థాపకుడు కాలనాథభట్ల వీరభద్రశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ‘విశ్వనాథ విజయం’
విజయవాడ కల్చరల్ : విశ్వనాథ సత్యనారాయణ జయంతిని పురస్కరించుకుని సిద్ధార్థ కళావేదికపై గురువారం సాయంత్రం నిర్వహించిన సాహితీ కార్యక్రమం ఆకట్టుకుంది. విశ్వనాథుని మిత్రుడు కొడాలి ఆంజనేయులు పాత్రలో డాక్టర్ చివుకుల సుందరరామశర్మ, విశ్వనాథ గురువు చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి పాత్రలో డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, కవి కాటూరిగా డాక్టర్ పింగళి వెంకటకృష్ణారావు, కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి పాత్రలో జంధ్యాల మహతీ శంకర్, గుర్రం జాషువా పాత్రలో ఎంపీ జానుకవి, కవయిత్రి తెన్నేటి హేమలత పాత్రలో కావూరి సత్యవతి తదితరులు విశ్వనాథునితో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.