భర్త సహా మరో ముగ్గురి అరెస్టు
రాయదుర్గం అర్బన్ : పెళ్లి చేసుకున్నాడు. చక్కగా కాపురం చేయాల్సిందిపోయి.. నిత్యం వేధించడం మొదలుపెట్టాడు. ఎలాగైనా ఆమె అడ్డు తొలగించుకుంటే మరో పెళ్లి చేసుకోవచ్చన్న కుట్రతో ఇలా చేశాడు. అతనికి తల్లి, సోదరుడు కూడా వంతపాడారు. ఇక అప్పటి నుంచి ఆమెను వేధించడం మొదలుపెట్టారు. అయినా ఆమె సర్దుకుపోవడం వారికి నచ్చలేదు. చివరకు రెండో పెళ్లి చేసుకొచ్చాడు. ఇంకేముంది మొదటి భార్య పోలీసులను ఆశ్రయించింది. తనను ఎలా చిత్రహింసలకు గురి చేసిందీ పూసగుచ్చినట్లు తెలిపింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రంగంలోకి దిగారు.
మోసం చేసింది బెంగళూరుకు చెందిన మంజునాథ కాగా, మోసపోయిన బాధితురాలు అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన కె.శ్రీదేవి. బాధితురాలి ఫిర్యాదు మేరకు నయవంచనకు గురి చేసిన మంజునాథను బుధవారం అరెస్టు చేశారు. అతని తల్లి శ్యామలమ్మ, తమ్ముడు రాము, రెండో పెళ్లాం మంజులను కటకటాల్లోకి నెట్టామని ఎస్ఐ మహానంది తెలిపారు. మనస్పర్థల నేపథ్యంలో శ్రీదేవి గత ఏడాది డిసెంబర్ 25న రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. నిందితులను కోర్టులో గురువారం హాజరు పరుస్తామని ఎస్ఐ వెల్లడించారు.