ఓటర్ల అనాసక్తి
♦ నీరసంగా మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పోలింగ్
♦ హెబ్బాళలో 46, బీదర్‌లో 56, దేవదుర్గలో 61శాతం పోలింగ్
సాక్షి, బెంగళూరు: శాసనసభ్యుల అకాల మరణంతో ఉప ఎన్నికలు జరిగిన హెబ్బాళ, బీదర్, దేవదుర్గ అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోలింగ్ నీరసంగా సాగింది. శనివారం ఉదయం 10గంటల వరకు కూడా పోలింగ్ కేంద్రాల్లో పెద్దగా ఓటర్లు కనిపించలేదు. దీంతో సాయంత్రం ఐదు గంటల సమయానికి హెబ్బాళలో 46శాతం ఓటింగ్ నమోదు కాగా, బీదర్‌లో 56శాతం, దేవదుర్గలో 61శాతం ఓటింగ్ నమోదైంది. ఇక చెదరుమదురు ఘటనలు మినహా మూడు నియోజకవర్గాల్లోనూ పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఇక హెబ్బాళ పరిధిలోని 88, 103వ నంబర్ పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలు మొరాయించిన నేపథ్యంలో గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది.
♦ డాలర్స్ కాలనీలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఎమ్మెల్సీ జయమాల తన ఓటరు గుర్తింపు కార్డును మరిచిపోయి వచ్చారు. దీంతో ఆమెను పోలింగ్ అధికారులు ఓటు వేసేందుకు అనుమతించలేదు. అనంతరం జయమాలా కుమార్తె సౌందర్య, జయమాల గుర్తింపు కార్డును తీసుకొచ్చారు. తర్వాత వీరిరువురూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
♦ హెబ్బాళ నియోజక వర్గ పరిధిలో మాజీ ఎమ్మెల్సీ అబ్దుల్ అజీమ్, జేడీఎస్ అభ్యర్థి ఇస్మాయిల్ షరీఫ్, కాంగ్రెస్ అభ్యర్థి రెహమాన్ షరీఫ్, మాజీ ఎంపీ డి.బి.చంద్రేగౌడ, అదనపు పోలీస్ కమిషనర్ చరణ్‌రెడ్డి తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
♦ బీదర్ ఉప ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి ధరమ్‌సింగ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, తాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి ఓటు వేస్తున్నాని బహిరంగంగా చెప్పడం ద్వారా ధరమ్‌సింగ్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు.
♦ బీదర్‌లో శనివారం సాయంత్రం ఐదు గంటల సమయానికి 56శాతం ఓటింగ్ నమోదైంది.
♦ దేవదుర్గలోని అన్ని ప్రాంతాల్లోనూ పోలింగ్ ప్రశాంతంగా సాగింది. శనివారం సాయంత్రం ఐదు గంటల సమయానికి ఇతర ప్రాంతాలతో పోలిస్తే అత్యధికంగా 61శాతం ఓటింగ్ నమోదైంది.