ట్రిపుల్ ధమాకా
ఒకే కాన్పులో ముగ్గురు జన్మించిన అరుదైన సంఘటన తణుకు పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన దేవ్కర్ నామదేవ్ కుటుంబం తణుకులో స్థిరపడింది. నామదేవ్ బంగారం పని చేస్తుంటాడు. అతని భార్య సవితకు నెలలు నిండటంతో తణుకులోని విజయ నర్సింగ్ హోమ్‌లో చేర్పించాడు. గురువారం ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించగా, ఉదయం 11.41 గంటలకు ఒక పాప జన్మించింది. 11.43 గంటలకు మరొక పాప, 11.45 గంటలకు బాబు జన్మించారు. మొదటి పాప 2.5 కేజీలు, రెండవ పాప 2.8 కేజీలు, బాబు 2.3కేజీల బరువు ఉన్నట్లు వైద్యురాలు డాక్టర్ లక్ష్మి చెప్పారు. సాధారణంగా ముగ్గురు శిశువులు ఒకేసారి జన్మిస్తే.. బరువు తక్కువ ఉంటారని, కొన్ని లోపాలు కూడా ఉండే అవకాశం లేకపోలేదని అన్నారు.
ఈ ముగ్గురు శిశువులు తగిన బరువుతో, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని ఆమె వివరించారు. చిన్నారుల తండ్రి నామదేవ్ మాట్లాడుతూ తన భార్యకు ఆరేళ్ల క్రితం మొదటి కాన్పులో ఆడపిల్ల జన్మించిందని చెప్పాడు. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు పుట్టడం ఆనందంగా ఉందన్నాడు.
- న్యూస్‌లైన్/తణుకు అర్బన్