అవిరామ, అసిధారావ్రతం
ఇది కొత్త అధ్యాయం. సరికొత్త వేదికపై అక్షరవిన్యాసం. అసిధారావ్రతం. రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలలో కనిపిస్తున్న ధోరణులను సామాన్య ప్రజల పక్షాన నిలబడి గమనిస్తూ కార్యకారణ సంబంధాలను చర్చించే మేధో మథనం. వెరసి తెలుగు పాఠకలోకానికి వినమ్రంగా సమర్పిస్తున్న మరోకాలమ్. దాదాపు నాలుగు దశాబ్దాల పాత్రికేయ ప్రస్థానంలో పాఠకులతో సాగిస్తున్న సంభా షణ, సమాలోచనల కొనసాగింపు.
ఆంధ్రప్రభలో రకరకాల శీర్షికలు. ఉదయంలో వీక్షణం. వార్తలో వార్తావ్యాఖ్య. ఆంధ్రజ్యోతిలో సకాలం, హన్స్ ఇండియాలో థర్స్ డే థాట్స్. ఇప్పుడు ’త్రికాలమ్’. వర్తమాన పరిణామాలను అధ్యయనం చేసి వ్యాఖ్యానించే విశ్లేషకుడికి గతం తెలిసి ఉండాలి. వర్తమానం గురించి క్షుణ్ణమైన అవగాహన అవసరం. భవిష్యత్తును ఊహించి చెప్పగల దార్శనికత కావాలి. గతం విస్మరించిన వాడు వర్తమానాన్ని సవ్యంగా అర్థం చేసుకోలేడు. భవిష్యత్తుకు సరైన బాటలు చూపించలేడు. ‘త్రికాలమ్’ లో గతాన్ని దృష్టిలో పెట్టుకొని వర్తమాన పరిణామాలను పరిశీలించి అవి భవిష్యత్తులో ఏ తీరాలకు దారితీయగలవో అంచనా వేసే ప్రయత్నం చేయాలని సంకల్పం. జరుగుతున్న చరిత్రకు భాష్యం చెప్పడం కత్తిమీద సాము. నిష్పక్ష పాతంగా, నిర్వికారంగా, సమదృష్టితో, న్యాయబద్ధంగా చేయవలసిన క్రతువు. జనజీవనంలో సంభవిస్తున్న పరిణామాలను విశ్లేషించి వివరిస్తే సరైన నిర్ణయాలు తీసుకునే వివేకం ప్రజలకు ఉన్నదనే విశ్వాసంతో సాగిస్తున్న ప్రయాస. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు కనుక మంచిచెడులను వారికే విన్నవించాలన్న తాపత్రయం. అక్షరం ద్వారా ప్రజాసేవను కొనసాగించా లన్న ఆకాంక్ష.
అరవై ఎనిమిదేళ్ళ స్వాతంత్య్రంలో మనం ఏమి సాధించాం? వివిధ రంగాలలో అనేక విజయాలు నమోదు చేశాం. ఇటీవల అంగారక గ్రహం కక్ష్యలోకి ఉపగ్రహాన్ని మొదటి ప్రయత్నంలోనే విజయవంతంగా ప్రవేశపెట్టడం జాతి యావత్తూ గర్వించవలసిన అద్భుతమైన ఘనకార్యం. పరాజయాలూ అదే స్థాయిలో చవిచూశాం. ఇప్పటికీ ప్రపంచంలోని పేదలలో సగం మంది మన దేశంలోనే ఉండటం, మహిళలపైన అత్యాచారాలు సాగడం, వేల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం అందరం సిగ్గుతో తలవంచుకోవలసిన చేదునిజాలు.
శుక్రవారం నాడు హైదరాబాద్‌లో మంథన్ సంవాద్ కార్యక్రమం జరిగింది. అజయ్ గాంధీ, కాకి మాధవరావుల ఆధ్వర్యంలో జరిగిన ఈ మేధోమథనానికి వేయిమందికి పైగా మేధావులు హాజరైనారు. ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు అరుణ్ మైరా ఈ సదస్సులో మాట్లాడుతూ ప్రధాని మోదీ అమెరికా యాత్ర గురించి ప్రస్తావించారు. మూడు ‘డీ’ల కారణంగా భారత్ సత్వరం అభివృద్ధి చెందుతుందని మోదీ న్యూయార్క్‌లోని మాడిసన్ గార్డెన్లో జరిగిన ప్రవాస భారతీయుల సభలో చెప్పారని గుర్తుచేశారు. మొదటి డి: డెమోక్రసీ (ప్రజాస్వామ్యం). రెండవ డి: డెమోగ్రఫీ (జనాభా), మూడవ డి: డిమాండ్ (అవసరం). కానీ తన దృష్టిలో మరో డి ఉన్నదనీ, అది డైవర్సిటీ (వైవిధ్యం) అనీ అరుణ్ చాలా చక్కగా చెప్పారు. అదే సభలో ఒక సభికుడు లేచి ఐదో డి అత్యవసరమని నొక్కిచెప్పారు. అదే డిసిప్లిన్ (క్రమశిక్షణ). వీటన్నిటిలోకీ అత్యంత ప్రధానమైనది ముమ్మాటికీ ప్రజాస్వామ్యమే. ఐదేళ్ళకోసారి శాంతియుతంగా ఎన్నికల ద్వారా ప్రభుత్వాలను మార్చుకోగలుగుతున్నాం. పొరుగున ఉన్న పాకిస్థాన్ ప్రజల కంటే, ప్రపంచంలోని అనేక ఇతర దేశాల ప్రజలకంటే మనం ఎంతో అదృష్టవంతులం. ప్రజా స్వామ్యం ప్రసాదించే స్వేచ్ఛను కాపాడుకోవాలంటే నిరంతర నిఘా అత్యవసరం. ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు చర్చ ప్రాణం. మంథన్ సంవాద్‌లో ప్రసంగించిన ఇతర ప్రముఖులు అందరూ చర్చ ద్వారానే, హేతుబద్ధమైన సంవాదం ద్వారానే దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకోవాలనీ, ప్రగతికి బాటలు వేయాలనీ హితవు చె ప్పారు.
ప్రజాస్వామ్య వ్యవస్థ పుణ్యమా అని ఉన్నత పదవులు అధిష్టించినవారు ఈ ఆప్తవాక్యాన్ని మనసులో నిలుపు కోవాలి. ప్రజలతో నిమిత్తం లేకుండా, చర్చ, సమాలోచనలు లేకుండా, జనహితం పట్టించుకోకుండా ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి వంటి కీలకమైన పదవులలో ఉన్నవారికి తగదు. ఈ ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థకు హానికరం. అంతిమంగా ప్రజాశ్రేయస్సుకు గొడ్డలిపెట్టు. ఢిల్లీలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడి సుమారుగా నాలుగు నెలలు. నరేంద్రమోదీ, చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు తమదైన తీరులో పరిపాలన సాగిస్తున్నారు. మోదీ గొప్ప ప్రజా ప్రభంజనం సృష్టించి సార్వత్రిక ఎన్నికలలో అపూర్వమైన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన ఒకప్పటి నిరుపేద చాయ్ వాలా. ఇటువంటి అద్భుతం ప్రజాస్వామ్య వ్యవస్థలోనే సాధ్యం. గుజరాత్ ముఖ్యమంత్రిగా పదేళ్ళు చక్రం తిప్పిన మోదీ ఢిల్లీ సింహాసనం అధిష్టించే క్రమంలో తన కత్తికి ఎదురు లేకుండా చేసుకునే ప్రయత్నంలో అద్వానీ, మురళీమనోహర్ జోషీ వంటి కురువృద్ధులను పూర్వపక్షం చేయడమే కాకుండా తనకు నమ్మిన బంటు అమిత్ షాకు పార్టీ పగ్గాలు అప్పగించే విధంగా వ్యూహరచన చేశారు. మోదీ ఎంత ఎత్తు ఎదిగారంటే ఆయనతో విభేదించేవారు భారతీయ జనతా పార్టీలో కనిపించరు. వినిపించరు. ప్రధానిగా మోదీ శక్తిమంతంగా, సమర్థంగా వ్యవహరిస్తు న్నారు. కానీ నూటికి నూరు పాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా పని చేస్తున్నారా లేదా అన్నదే ప్రశ్న.
అమెరికా పర్యటనకు ముందు కానీ తర్వాత కానీ, పాకిస్థాన్‌తో చర్చల ప్రతిపాదనను రద్దు చేసుకునే సమయంలో కానీ ఇతర ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్న సందర్భాలలో కానీ ప్రధాని మరొకరితో చర్చించినట్టు కానీ సమాలోచనలు జరిపినట్టు కానీ, ఇతరుల సలహా ఆలకించి తన నిర్ణయం మార్చుకున్నట్టు కానీ దాఖలా లేదు. మోదీని ఆరాధిస్తున్న ఇంగ్లిష్ చానళ్ళకూ, పత్రికలకూ ఇది ఆక్షేపణీయంగా తోచడం లేదు. తాను ముందు నిర్ణయం తీసుకొని అనంతరం చర్చ నిర్వహించే నేర్పు చంద్రబాబు నాయుడిది. అది 2009 ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు నిర్ణయమైనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విజయవాడను రాజధాని చేయాలన్నా అదే పద్ధతి. రాజధాని ఎక్కడో నిర్ణయించేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫార్సులతో నిమిత్తం లేకుండా, శాసనసభలో ప్రతిపక్షానికి ఈ అంశంపైన ప్రశ్నించే, చర్చించే అవకాశం ఇవ్వకుండా సంఖ్యాబలంతో తీర్మానం చేయించారు.
ఇక చంద్రశేఖరరావు ఎవరిని సంప్రదిస్తున్నారో, ఆయనకు సలహా చెప్పే చొరవ ఎవరికున్నదో, ఆయన అభీష్టానికి భిన్నంగా మాట్లాడే సాహసం ఎవరికున్నదో తెలియదు. ముగ్గురూ సమర్థులైన పాలకులే కావచ్చు. కానీ సమష్టి నాయకత్వంలో అందరినీ కలుపుకొని పరిపాలన సాగించాలనీ, సంఖ్యాబలం లేనివారి వాదనలో హేతు బద్ధత ఉన్నట్లయితే ఆ వాదనను అంగీకరించాలనీ, కీలకమైన నిర్ణయాలు తీసుకునే క్రమంలో సాధ్యమైనంత విస్తృతంగా సంప్రదింపులు జరపాలనీ ప్రజాస్వామ్య స్ఫూర్తి నిర్దేశిస్తున్నది.
ప్రవృద్ధ ప్రజాస్వామ్య దేశాలు ప్రజాస్వామ్య సూత్రాలను అక్షరాలా పాటిస్తాయి. ఇటీవల గ్రేట్‌బ్రిటన్‌లో స్కాట్లండ్ లో జరిగిన రెఫరెండం, దానికి ముందు రెండు మాసాలపాటు శాంతియుతంగా జరిగిన చర్చ ఇందుకు నిదర్శనం. రెఫరెండం జరిపించడం బ్రిటిష్ ప్రభుత్వ ప్రజాస్వామ్య స్పృహ అయితే ఆ అవకాశాన్ని సద్వి నియోగం చేసుకొని బాధ్యతాయుతంగా వ్యవహరించి తమ భవిష్యత్తును స్కాట్లండ్ ప్రజలు నిర్ణయించుకున్న పద్ధతి ప్రశంసనీయం. స్కాట్లండ్ పార్లమెంటు ఎన్నికలలో 52 శాతం, బ్రిటిష్ పార్లమెంటు (వెస్ట్‌మినిస్టర్) ఎన్నికలలో 72 శాతం ఓటర్లు పాల్గొంటే రిఫరెండంలో స్కాట్లండ్ ఓటర్లలో 85 శాతం మంది పాల్గొన్నారు. ప్రజాస్వామ్యం స్థిరపడిన దేశాలలో ప్రజల ప్రమేయంతో నిర్ణయాలు తీసుకోవడం రివాజు.
విజయవాడ రాజధాని కావాలంటూ చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం తప్పుకాకపోవచ్చు. కానీ నిర్ణయం తీసుకున్న విధానం ఆక్షేపణీయం. చంద్రశేఖర రావుకు కొన్ని మీడియా సంస్థల పట్ల ఆగ్రహం కలగడంలో తప్పు లేకపోవచ్చు. కానీ దాన్ని వ్యక్తం చేసిన తీరు అభ్యంతరకరం. వీరిద్దరికంటే మోదీ జాగ్రత్తగా వ్యవహ రిస్తున్నారని చెప్పవచ్చు. ఆయన ఇంతవరకూ మాట తూలిన సందర్భం కానీ సంఖ్యాబలంతో ఏకపక్షంగా వ్యవహరించిన ఘట్టం కానీ లేదు. మోదీని అదుపు చేయగల శక్తి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్)కు ఉంది. మోన్శాంటో, మరికొన్ని బహుళజాతి కంపెనీలు తయారు చేసిన వరి, జొన్న, తదితర వంగడాల క్షేత్ర ప్రయోగాలను యూపీఏ ప్రభుత్వం అనుమతించలేదు. ఎన్డీఏ సర్కార్ రాగానే ఈ ప్రయోగాలను అనుమతిం చాలని నిర్ణయించింది. బీజేపీకి అనుబంధ సంస్థ భార తీయ కిసాన్ సంఘ్ తీవ్రంగా వ్యతిరేకించడంతో నిర్ణ యాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులను అదుపు చేసే అంకుశం ఏదీ లేదు. తమ ముఖ్యమంత్రి పనితీరును కానీ, నిర్ణయాలను కానీ తప్పు పట్టి వారితో వాదించే స్థాయి గలవారు తెలుగుదేశం పార్టీలో కానీ తెరాసలో కానీ ఎవ్వరూ లేరు. అంతర్గత ప్రజాస్వామ్యం పరిఢవిల్లిన పార్టీలలోనే అటువంటి దిద్దుబాటు వ్యవస్థ ఉంటుంది. పార్టీ శ్రేణుల నుంచి కానీ నాయకుల నుంచి కానీ ఒత్తిడి వచ్చే అవకాశం లేదు కనుక ప్రజలకు వాస్తవాలు తెలియ జెప్పి, ప్రభుత్వ నిర్ణయాల బాగోగులను వివరించవలసిన బాధ్యత పత్రికలమీదా, టీవీ న్యూస్ చానళ్ళ మీదా, ఇతర పౌరవ్యవస్థల మీదా ఉంది.
ప్రజాస్వామ్య వ్యవస్థ పుణ్యమా అని ఉన్నత పదవులు అధిష్టించిన వారు ఈ ఆప్తవాక్యాన్ని మనసులో నిలుపుకోవాలి. ప్రజలతో నిమిత్తం లేకుండా, చర్చ, సమాలోచనలు లేకుండా, జనహితం పట్టించుకోకుండా ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి వంటి కీలకమైన పదవులలో ఉన్నవారికి తగదు. ఈ ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థకు హానికరం. అంతిమంగా ప్రజాశ్రేయస్సుకు గొడ్డలిపెట్టు.
కె. రామచంద్రమూర్తి