three dead in road accident
-
తెల్లారిన కూలీల బతుకులు
వినుకొండ (నూజెండ్ల): పొట్టకూటి కోసం వలస వచ్చిన నిరుపేదల పాలిట మినీ లారీ మృత్యుపాశమయ్యింది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ముగ్గురి బతుకులు తెల్లారిపోగా.. మరో 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మంగళవారం తెల్లవారుజామున గుంటూరు జిల్లా వినుకొండ రూరల్ మండలం అందుగుల కొత్తపాలెం వద్ద చోటు చేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం పరిధిలోని పార్లపలి, మాసుమాను దొడ్డి, కొసిగి, పల్లెపాడు గ్రామాల నుంచి సోమవారం రాత్రి గుంటూరు జిల్లాకు సుమారు 100 మందికి పైగా వలస కూలీలు నాలుగు మినీ లారీల్లో బయలు దేరారు. యడ్లపాడు, పెదనందిపాడు ప్రాంతాల్లో మిర్చి, వేరుశనగ పొలాల్లో కూలి పనుల కోసం వీరంతా వస్తున్నారు. వీరిలో మాసుమానుదొడ్డి గ్రామానికి చెందిన కూలీలతో బయలుదేరిన మినీ లారీ అందుగుల కొత్తపాలెం గ్రామ శివారులోని లక్ష్మక్క వాగు బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి డ్రైవర్ నిద్రమత్తు కారణంగా అదుపుతప్పి బోల్తా కొట్టి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఘటనలో భీముడు (50), యర్నాల శ్రీనివాసరావు (6), వాహనం యజమాని, డ్రైవర్ బొంతల ఉమేష్‌కుమార్ నాయుడు అక్కడికక్కడే మృతి చెందారు. వినుకొండ, బొల్లాపల్లి, ఈపూరు, నూజెండ్ల 108 వాహన సిబ్బంది సకాలంలో స్పందించి గాయపడ్డ వారిని పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వాహనంలో ఇరుక్కుపోయిన మృత దేహాలతో పాటు గాయపడిన వారిని బయటకు తీసి జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తమ సహచరుల వాహనం ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న మిగతా వలస కూలీలు భారీగా వినుకొండ ప్రభుత్వ వైద్యశాల వద్దకు చేరుకున్నారు. వారి రోదనలతో ఆస్పత్రి ప్రాంగణం మార్మోగింది. వారందరినీ స్వస్థలాలకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. -
అతి వేగం.. మద్యం మత్తు
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లో ఆదివారం తెల్లవారుజామున అదుపుతప్పిన వేగంతో వచ్చిన ఓ కారు.. హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో హోటల్‌తో పాటు కారు ముందు భాగం దెబ్బతింది. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో టీఎస్10ఈపీ6331 నంబర్ గల కారు జూబ్లీహిల్స్ నుంచి సాగర్ సొసైటీ మీదుగా పంజగుట్ట వైపు మితిమీరిన వేగంతో దూసుకొచ్చింది. మసీదు ముందు రోడ్డు డౌన్లో మలుపు ఉండటంతో కారు అదుపుతప్పి రాయల్ టిఫిన్ సెంటర్ కాంపౌండ్‌లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో టిఫిన్ సెంటర్లో రద్దీ తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. కారులో ముగ్గురు యువకులు ఉన్నారని, ప్రమాదానికి గురికాగానే కారును వదిలేసి పరారైనట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. కారులో ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవడంతో అందులో ఉన్న వారు ప్రాణాలతో బయటపడ్డారు. బంజారాహిల్స్ ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకొన్నారు. యువకుల కోసం గాలిస్తున్నారు. మద్యం మత్తులో కారు నడిపినట్లుగా అనుమానిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదపు స్పాట్‌ను.. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి పంజగుట్ట వెళ్లే రోడ్డులో డేంజరస్ స్పాట్‌గా పోలీసులు గతంలోనే గుర్తించారు. ఆ స్థలంలోనే ప్రమాదం జరిగింది. చంపాపేట: సాగర్ రోడ్డు నుంచి చంపాపేటకు వెళుతున్న కారు కర్మన్‌ఘాట్ ప్రాంతంలో అతి వేగంతో అదుపుతప్పి పల్టీలు కొడుతూ.. పక్కనే ఉన్న ఫుడ్‌పాయింట్ గోడకు ఢీకొన్న ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ప్రైవేట్ ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి కథనం ప్రకారం.. సైదాబాద్‌లోని మాధవనగర్ ఎల్ఐసీ కాలనీకి చెందిన మాడపాటి వినాయక మల్లికార్జున్ (29), మారుతీనగర్‌కు చెందిన ధరావత్ శ్రీరాం నాయక్ (28), సైదాబాద్ సరస్వతీనగర్ కాలనీకి చెందిన పబ్బా సాయినాథ్, నాగోల్ మారుతీనగర్ కాలనీకి చెందిన కల్యాణ్ (27), సైదాబాద్ డిఫెన్స్ కాలనీకి చెందిన షేక్ గుల్జార్ అహ్మద్ (26), నాగోలు బండ్లగూడకు చెందిన బొట్ట యువమిత్ర (25) స్నేహితులు. శనివారం సాయంత్రం అందరూ కలిసి గుర్రంగూడలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో పార్టీ చేసుకుని మద్యం తాగారు. తిరిగి వచ్చే క్రమంలో సాయినాథ్కు చెందిన బైక్‌పై షేక్గుల్జార్ అహ్మద్, యువమిత్ర ఇంటికి బయల్దేరారు. మల్లికార్జున్, సాయినాథ్, శ్రీరాంనాయక్, కల్యాణ్ కారులో బయల్దేరారు. కర్మన్‌ఘాట్ చౌరస్తా దాటాక కారు అదుపుతప్పింది. రోడ్డుకు ఎడమ వైపు ఉన్న చెట్టును ఢీకొని పల్టీలు కొడుతూ 15 అడుగుల దూరంలో ఉన్న లక్ష్మిశ్రీ మెస్ అండ్ ఫుడ్ కోర్టు ముందు ఉన్న ఎగ్జాస్ట్ గొట్టాన్ని ఢీకొంది. కారు నడుపుతున్న మల్లికార్జున్, కారులో ఉన్న శ్రీరాంనాయక్, సాయినాథ్ అక్కడికక్కడే మృతిచెందారు. వెనుక సీట్లో ఉన్న కల్యాణ్ సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో స్వల్పగాయాలతో బయటపడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. కల్యాణ్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈలోగా బైక్‌పై అక్కడికి చేరుకున్న గుల్జార్‌అహ్మద్, యువమిత్ర.. ప్రమాద సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలిపా రు. సరూర్‌నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో కారు నడపడం, అతివేగమే ప్రమాదానికి కారణాలుగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం సమయంలో కారు వేగం 120–140 మధ్య ఉండవచ్చన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఇంజనీర్లు మృతి
మాగనూర్ (మక్తల్): మహబూబ్‌నగర్ జిల్లా మాగనూరు – కృష్ణా మండలాల సరిహద్దులోని నల్లగట్టు సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న కారు కల్వర్టుకోసం తవ్విన గుంతలో పడడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఏపీలోని విశాఖపట్నం జిల్లా రంప చోడవరానికి చెందిన ఆరుగురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు హైదరాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా శుక్రవారం.. ఆ తర్వాత రెండో శనివారం, ఆదివారం ఇలా వరుస సెలవులు రావడంతో అనిల్, అవినాశ్, అమర్నాథ్, మణికంఠ, మహేశ్, కామేశ్ కారులో గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి విహార యాత్రకు వెళ్లారు. గోకర్ణ, గోవా తదితర ప్రాంతాలను సందర్శించారు. అనంతరం వీరు సోమవారం ఉదయం విధులకు చేరుకునేలా ఆదివారం రాత్రి తిరుగు పయనమయ్యారు. కల్వర్టు గుంతలో పడి.. వీరు ప్రయాణిస్తున్న కారు మహబూబ్‌నగర్ జిల్లాలోని నల్లగట్టు సమీపానికి సోమవారం తెల్లవారుజామున చేరుకుంది. అయితే, వేగంగా వస్తున్న కారు అక్కడ కల్వర్టు నిర్మాణం కోసం తవ్విన గుంతలో పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న మణికంఠ (26), మహేశ్ (26), కామేశ్ (26) అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో మహేశ్, మణికంఠ అన్నదమ్ములు కావడం గమనార్హం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనలో మృతి చెందిన వారిలో ఇద్దరి మృతదేహాలు కారునుంచి బయటకు ఎగిరి పడగా, మరొకరి మృతదేహం కారులోనే ఇరుక్కుపోయింది. కృష్ణా ఎస్ఐ నరేశ్ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని జేసీబీతో కారు డోర్‌ను తొలగించి మృతదేహాన్ని బయటకు తీశారు. ఆ తర్వాత క్షతగాత్రులను చికిత్సకోసం మక్తల్‌కు, ఆపై హైదరాబాద్‌కు తరలించారు. -
రెండు ఆటోలు ఢీ, ముగ్గురు దుర్మరణం
గుంటూరు : గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నందివెలుగులో రెండు ఆటోలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా దుర్ఘటనా స్థలం రక్తసిక్తంగా మారింది. కాగా బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.