దిగులు లేదిక.. కరెంట్ పోదిక !
♦ రాష్ట్రంలో మిగులు విద్యుత్
♦ జనవరి వరకు సమస్యే ఉండదు
♦ యూనిట్ అదనపు ఉత్పత్తి లేకున్నా మిగులు విద్యుత్
♦ ఆరు నెలల్లో మారిన పరిస్థితులు
♦ వచ్చే మార్చిలో స్వల్ప లోటు
♦ డిమాండు, లభ్యతపై విద్యుత్ శాఖ అధికారుల అంచనాలు
సాక్షి, హైదరాబాద్: ఎడాపెడా విద్యుత్ కోతలు.. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియదు.. వ్యవసాయానికి మూడు గంటలే విద్యుత్.. అదీ రెండు మూడు విడతల్లో... ఆర్నెల్ల కిందటి వరకు రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వ్యవస్థ ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉండేది. అయితే ఆర్నెల్లు తిరిగే సరికి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. రాష్ట్రంలో ఇప్పుడు విద్యుత్ కోతలు లేవు! ప్రస్తుతం రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంది.
గరిష్టంగా రోజుకు 165 మిలియన్ యూనిట్ల(ఎంయూ) సరఫరా సామర్థ్యం కలిగి ఉన్నా..ప్రస్తుతం డిమాండు 130 ఎంయూలకు మించడం లేదు. నిర్మాణంలో ఉన్న కొత్త ప్రాజెక్టులు పూర్తయితే 2016 నాటికి రాష్ట్రంలో విద్యుత్ కొరత వుండదని, 2018 నాటికి తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. నూతన రాష్ట్రం ఏర్పడిన ఏడాదిలోనే.. అదీ కొత్త ప్రాజెక్టుల నుంచి ఒక్క యూనిట్ రాకున్నా రాష్ట్రం ‘మిగులు విద్యుత్’ మైలురాయిని అందుకుంది.
2015 జూన్ నుంచి 2016 మార్చి వరకు రాష్ట్రంలో విద్యుత్ డిమాండు, లభ్యతపై తాజాగా విద్యుత్ సంస్థలు రూపొందించిన అంచనాలు ఇదే అంశాన్ని పేర్కొంటున్నాయి. ఈ అంచనాల ప్రకారం వచ్చే జనవరి వరకు రాష్ట్రంలో ఎలాంటి విద్యుత్ కొరత వుండదు. ఆ తర్వాత ఫిబ్రవరి, మార్చి నెలల్లో స్వల్పంగా కొరత ఏర్పడవచ్చు.
మిగులు విద్యుత్‌పై ధీమా..
సొంత ఉత్పత్తి, కేంద్ర ఉత్పత్తి సంస్థలు (సీజీఎస్), పీపీఏల ద్వారా ప్రస్తుతం రాష్ట్రంలో 5,500 మెగావాట్ల విద్యుత్ లభ్యత ఉంది. అందులో 1,980 మెగావాట్లను ఒప్పందాల ద్వారా కొనుగోలు చేస్తుండగా, మరో 1,200 మెగావాట్ల కొనుగోళ్లకు సంబంధించి ఆర్డర్లు పరిశీలనలో ఉన్నాయి. ఎన్టీపీసీ ఝజ్జర్ ప్లాంట్ నుంచి 150, కేంద్ర విద్యుత్ సంస్థల ద్వారా 290, గాయత్రి థర్మల్ పవర్ నుంచి 810 మెగావాట్లు సైతం అందుబాటులోకి రానున్నాయి.
ఈ నేపథ్యంలో ఎలాంటి కోతలు లేకుండా కరెంటు సరఫరా చేయగలమని విద్యుత్ సంస్థలు ధీమాతో వున్నాయి. గత ఖరీఫ్‌లో వ్యవసాయానికి సరిగా విద్యుత్ సరఫరా చేయలేకపోయినా, రానున్న ఖరీఫ్‌లో మాత్రం ఏడు గంటల విద్యుత్ ఇస్తామని అధికారులు ధీమాతో వున్నారు. కాగా, గతేడాది డిమాండుతో పోల్చితే ఈ ఏడాది 8 శాతం పెరుగుదల ఉంటుందన్న భావనతో విద్యుత్ సంస్థలు తాజాగా ఓ అంచనాను తయారు చేశాయి.