3 నూతన సామాజిక పథకాలు షురూ
కోల్‌కతా: ప్రధాని నరేంద్రమోదీ శనివారం కోల్‌కతాలో మూడు సామాజిక పథకాలను ప్రారంభించారు. ఇవి జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. పేదలకు కావాల్సింది సాయం కాదు.. సాధికారత అని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కొత్త పథకాలివీ.. ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై).. బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతా ఉన్నవారికి ఏటా రూ. 330 ప్రీమియంతో రూ. 2 లక్షల జీవిత బీమా అందిస్తుంది. ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన (పీఎంఎస్బీవై) కింద 18-70 లోపు వయసున్న వారు ఏటా రూ. 12 ప్రీమియంచెల్లిస్తే.. ప్రమాదంలో చనిపోయినా అంగవైకల్యానికి గురైనా రూ. 2 లక్షల బీమా అందుతుంది.
అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) కింద అసంఘటిత రంగ కార్మికులకు వారి ప్రీమియాన్ని బట్టి రూ. వెయ్యి నుంచి రూ. 5 వేల వరకు పింఛన్ అందిస్తారు. ఈ కార్యక్రమంలో పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ కూడా పాల్గొన్నారు. రాజ్‌భవన్‌లో మోదీతో ప్రత్యేకంగా భేటీ అయిన మమత.. రాష్ట్రంపై ఉన్న రూ. 2.74 లక్షల కోట్ల అప్పుల భారాన్ని కేంద్రం మాఫీ చేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. నేతాజీ కుటుంబీకులు మోదీని మరోసారి కలిసి ఆయన మరణానికి సంబంధించిన రహస్య ఫైళ్లను బయటపెట్టాలని కోరారు.