అడవిలో రాత్రంతా తండ్రి శవం వద్ద..
నిజామాబాద్ : అటవీ ప్రాంతంలో రాత్రి సమయంలో తండ్రి మృతదే హం పక్కన ఏకంగా పది గంటలపాటు గడిపిన మూడేళ్ల కొడుకు.. తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటన దగ్గి అటవీప్రాంతంలో జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివా రం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ ఇందల్వాయి పర్యటనలో భాగంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఇంద ల్వాయి మండలం వెంగల్పాడ్కు చెందిన మాలవత్ రెడ్డి (34) గత జూన్ నెల 21న తన మేనమామ చంద్రును యాచారంలో దింపేందుకు తన కొడుకు నితిన్(3)తో కలిసి బైక్పై వెళ్లాడు.
చంద్రును యాచారంలో దింపి తిరుగు ప్రయాణమైన రెడ్డి బైక్ను అజాగ్రత్తగా నడపడంతో దగ్గి అటవీ ప్రాంతంలో సుమారు రాత్రి 8 గంటల ప్రాంతంలో దర్గా వద్ద బారికేడ్కి ఢీకొట్టి ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదంలో తీవ్ర గాయాలైన రెడ్డి ఘటనాస్థలంలోనే మృతి చెందగా అతడి కొడుకు నితిన్ ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డాడు. కాని రాత్రి సమయంలో వారిని ఎవరూ గమనించకపోవడంతో ప్రమాద సమాచారం ఎవరికీ తెలియలేదు.
ఇంటి నుంచి రెడ్డికి ఫోన్లు వస్తున్నప్పటికీ వాటిని లిఫ్ట్ చేసి సమాధానం చెప్పలేని వయస్సు నితిన్ది. దీంతో ఏమి చేయా లో తోచని పసిబాలుడు నితిన్ తండ్రి మృతదే హం వద్దే ఉదయం ఆరు గంటల వరకు ఉన్నా డు. ఉదయం అక్కడ ఉన్న ఓ ఆలయ పూజారి రోడ్డు దాటుతుండగా నితిన్ని గమనించి అక్కడకు వెళ్లగా రెడ్డి మృతి చెంది ఉన్నాడు. నితిన్ ఏడుస్తూ కనపించాడు.
ఇంటినుంచి ఫోన్లు వస్తుండటంతో ఫోన్ లిఫ్ట్ చేసి ప్రమాదం గురించి కుటుంబ సభ్యుల కు, పోలీసులకు సమాచారం అందించాడు. అంత రాత్రి సమయంలో అటవీ ప్రాంతంలో ఏకంగా పది గంటలకు పైగా తండ్రి మృతదేహం వద్ద దీనస్థితిలో గడిపిన నితిన్ని చూసి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ చలించిపోయారు.