మంచంపట్టిన తుక్కాపూర్
పలువురికి విషజ్వరాలు
పారిశుద్ధ్య లోపమే కారణమంటున్న వైద్యులు
కొల్చారం: కొల్చారం మండలం తుక్కాపూర్‌లో వారం రోజులుగా గ్రామస్తులు విషజ్వరాలతో బాధపడుతున్నారు. మలేరియా, టైఫాయిడ్ గ్రామస్తులను పట్టిపీడిస్తున్నాయి. తెల్లరక్తకణాల సంఖ్య తగ్గిపోవడంతో జ్వరాలు వ్యాపిస్తున్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
వైద్య సేవల కోసం మెదక్, జోగిపేట, తదితర ప్రాంతాలకు వెళ్లి ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందుతున్నారు. ఇప్పటి వరకు 25మంది విషజ్వరాలతో బాధపడుతున్నట్లు తెలిసింది. అసలే కష్టాల్లో ఉన్న తమకు మాయరోగాలు ప్రాణాలమీదికి తెస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయమై రంగంపేట వైద్యాధికారి మురళీధర్ మాట్లాడుతూ గ్రామంలో ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేయడంతోపాటు అవసరమైన వైద్యసేవలందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పారిశుద్ధ్యలోపంవల్లే గ్రామంలో రోగాలు వస్తున్నాయని, కాచివడపోసిన నీటిని మాత్రమే తాగాలని ఆయన సూచించారు.