జిన్‌పింగ్ రాకతో వెల్లువెత్తిన నిరసనలు
సాక్షి, న్యూఢిల్లీ: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత పర్యటను నిరసిస్తూ టిబెటన్లు బుధవారం నగరంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. చైనా రాయబార కార్యాలయం వద్ద టిబెటన్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిర్వహించిన ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. టిబెటన్ యూత్ కాంగ్రెస్ నాయకులతోపాటు కార్యకర్తలను అదుపులోకి తీసుకొని సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. టిబెట్‌పై చైనా ఆధిపత్యాన్ని నిరసిస్తూ 2009 నుంచి ఇప్పటిదాకా దాదాపు 130 మందికిపైగా టిబెటన్లు ఆత్మాహుతి చేసుకున్నారని, అటువంటి సమస్య పరిష్కారం కోసం తాము భారత్‌ను నమ్ముకుంటే..
భారత్ ఇప్పుడు చైనాతో చేతులు జోడించడం సరికాదంటూ నినాదలు చేశారు. భారత పర్యటనకు వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తమ సమస్య పరిష్కారం కోసం కృషి చేసేలా భారత్ ఆయనపై ఒత్తిడి తెస్తుందని ఆశిస్తున్నట్లు టిబెటన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు టెంజింగ్ జిగ్మె చెప్పారు. ఇదిలాఉండగా బుధవార మధ్యాహ్నం భారత్‌కు చేరుకున్న జిన్‌పింగ్ గుజరాత్‌కు వెళ్లి అక్కడి సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరే అవకాశముందని సంబంధిత అధికారులు తెలిపారు.