టికెట్ల బేరాలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇంకా పూర్తి కాకుండానే మహాకూటమిలో ప్రధాన భాగస్వామ్యపక్షాలైన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో టికెట్ల బేరాల వివాదం ముదిరిపాకాన పడింది. కీలక నేతలు సీట్లు ఇప్పించేందుకు రూ. కోట్లలో బేరాలాడుతున్నారంటూ పలువురు ఆశావహులు రచ్చకెక్కడం తీవ్ర దుమారం రేపుతోంది. ఎన్నికల సమయంలో ఇలాంటి ఆరోపణలు సహజమే అయినా ఈసారి ఆశావహులు టికెట్ల అమ్మకానికి సంబంధించి మీడియా ముందుకొచ్చి మరీ రుజువులు బయటపెడుతుండటం ఇరు పార్టీలను కలవరానికి గురిచేస్తోంది. ముఖ్యంగా కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఈ అంశం తీవ్రంగా కుదిపేస్తోంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మొదలు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా, పార్టీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్త చరణ్‌దాస్ ఇతర ఏఐసీసీ కార్యదర్శుల దాకా ఈ తరహా ఆరోపణలు ఎదుర్కొంటుండటం గమనార్హం. అలాగే టీడీపీలోని పలువురు నేతలపైనా టికెట్ల బేరాలు గుప్పుమంటున్నాయి. మరోవైపు అభ్యర్థులను అధికారికంగా ప్రకటిస్తే తమ పరిస్థితి ఏమిటోనని తెలంగాణ జనసమితి నేతల్లోనూ ఆందోళన పట్టుకుంది.
తెరపైకి భక్త చరణ్‌దాస్ పేరు...
కాంగ్రెస్‌లో తీవ్రంగా ఉండే టికెట్ల పంచాయతీలను వీలైనంతగా తగ్గించాలన్న ఉద్దేశంతో పార్టీ అధిష్టానం ఏఐసీసీ నేత భక్త చరణ్‌దాస్ నేతృత్వంలో స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఢిల్లీలో కాకుండా నేరుగా ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోనే ఈ కమిటీ సమావేశమై అభ్యర్థులను స్క్రీనింగ్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ కమిటీ దాదాపు 15 రోజులపాటు హైదరాబాద్‌లోని ఓ హోటల్‌తోపాటు రిసార్ట్‌లో తిష్ట వేసింది. అయితే స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కుమారుడు సాగర్ ఇక్కడే ఉండి టికెట్లు ఇప్పిస్తామని భారీగా డబ్బులు వసూలు చేశారన్నది పలువురు కాంగ్రెస్ నేతల ఆరోపణ. వీటికి రుజువుగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ గురువారం ఇందుకు సంబంధించిన ఫోన్ సంభాషణలను మీడియాకు విడుదల చేయడం సంచలనమైంది. టికెట్ ఇప్పించేందుకు తన కుమారుడు అంజన్ కుమార్‌ను భక్త చరణ్‌దాస్ కుమారుడు రూ. 3 కోట్లు డిమాండ్ చేశారంటూ మల్లేశ్ ఈ ఆడియోను మీడియాకు వినిపించారు. శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్, పార్టీ మేడ్చల్ టికెట్ ఆశించిన జంగయ్య యాదవ్ సైతం ఇప్పటికే ఇవే ఆరోపణలు చేశారు. పార్టీ కోసం నాలుగున్నరేళ్లు కష్టపడి పనిచేస్తే హైదరాబాద్‌లో పేకాట క్లబ్‌లు నిర్వహించే వ్యక్తికి వేలంపాటలో టికెట్ అమ్ముకున్నారని మంచిర్యాల నుంచి టికెట్ ఆశించిన అరవింద్‌రెడ్డి కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు.
కొంప ముంచిన హైడ్రామా...
టికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను హైదరాబాద్‌లోనే పరిశీలిస్తున్నామని పార్టీ ప్రకటించడంతోనే ఆశావహులు రాష్ట్ర రాజధానికి చేరుకున్నారు. ఎలాగైనా టికెట్ సంపాదించాలన్న కాంక్షతో కొందరు ఢిల్లీ నుంచి వచ్చిన స్క్రీనింగ్ కమిటీ సభ్యులను ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు. ఇక్కడే టికెట్ల తతంగం కానిచ్చేస్తున్నామన్న పార్టీ హైడ్రామానే ఈ మొత్తం ఆరోపణలకు తావిచ్చింది. దీనికితోడు ఫలానా సమయంలో, ఫలానా చోట స్క్రీనింగ్ కమిటీ సమావేశమవుతోందన్న విషయం టీవీల ద్వారా ఆశావహులకు తెలియడం కూడా పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. ఓ హోటల్లో స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతుందని వార్తలు వెలువడగానే ఆశావహులు ఏకంగా ఆ హోటల్లోనే గదులు బుక్ చేసుకుని మకాం వేయడం మొదలుపెట్టారు. అక్కడి నంచి హైదరాబాద్ శివార్లలోని ఓ రిసార్ట్‌కు కమిటీ మకాం మార్చినా అక్కడా అదే పని చేశారు. ‘ఇప్పుడు నాకు 64 ఏళ్లు. పోటీ చేస్తే ఇప్పుడే చేయాలి. ఇదే చివరి అవకాశం.
అందువల్ల రూ. 2 కోట్లు పడేసి టికెట్ సంపాదించాలని ప్రయత్నించా. స్క్రీనింగ్ కమిటీ సభ్యుడొకరిని హోటల్లో పట్టుకోగలిగా. ఆయన రూ. 5 కోట్లు డిమాండ్ చేశాడు. చివరకు నేను రూ. 3 కోట్లు ఇస్తానన్నా. రూ. కోటి అడ్వాన్స్‌గా ఇచ్చా. ఈ సంగతి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో సన్నిహితంగా ఉండే ఓ నేతకు కూడా తెలుసు. కానీ నాకు జాబితాలో చోటు దక్కలేదు. ఫోన్ చేస్తే స్విచాఫ్ వస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ అధినేత రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకెళ్తా’అని ఉత్తర తెలంగాణ జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ నేత చెప్పుకొచ్చారు. స్క్రీనింగ్ కమిటీ సభ్యులంతా తనకు తెలుసునంటూ వీలైతే టికెట్ ఇప్పిస్తానంటూ ఓ హడావుడి కాంగ్రెస్ నేత కూడా నలుగురైదుగురు ఆశావహుల నుంచి భారీగానే డబ్బు దండుకున్నట్లు తెలియవచ్చింది.
టీడీపీ నేతల వసూళ్లు!
టీడీపీలోనూ సీట్ల బేరాలపై భారీగా ఆరోపణలు వెల్లువెత్తాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్ సీటును చివరి క్షణంలో ఆ పార్టీ నేత ఎల్. రమణ అమ్ముకున్నారని ఆ సీటు ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ నేత కార్తీక్‌రెడ్డి ఆరోపించారు. టీడీపీ ఇక్కడ విజయం సాధించడం కష్టమని తెలిసినా సీటు పట్టుబట్టడానికి కారణం ఇదేనని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఎల్బీ నగర్ నుంచి టికెట్ ఆశిస్తున్న టీడీపీ నేత సామ రంగారెడ్డి నుంచి ఇద్దరు నేతలు డబ్బు వసూలు చేశారని ఆయన అనుచరులు ఆరోపించారు. అంతేకాకుండా సామ రంగారెడ్డిని వేరేచోట సర్దుబాటు చేస్తామని చెప్పి ఎల్బీ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి నుంచి కూడా డబ్బు తీసుకున్నారన్నది వారి ఆరోపణ. అయితే తనకు ఏమాత్రం సంబంధం లేని ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని కేటాయించడంపై సామ రంగారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ అధినేత చంద్రబాబును కలిసేందుకు అమరావతి వెళ్లారు. తనకు న్యాయం జరగకపోతే మొత్తం బండారం బయటపెడతానని ఆయన హెచ్చరించారు.