16 ఏళ్లలో 160 పాములు కరిచినా..
కాలిఫోర్నియా: మనుషులకు పాము కరిస్తే.. ఏమవుతుంది? ప్రాణం పోతుంది, అంతే కదా! కానీ అమెరికా శాస్త్రవేత్త టిమ్ ఫ్రిదే(37)కు మాత్రం ఏమీ కాదు. పాముల విషాలపై పరిశోధనలు చేసే టిమ్‌ను 16 ఏళ్ల కాలంలో దాదాపు 160 పాములు కరిచాయి. చెప్పాలంటే ఆయనే కరిపించుకున్నాడు. వీటిలో ప్రపంచంలోనే అతి విషపూరితమైన ‘టైపన్, బ్లాక్ మాంబా’ లాంటి పాములు కరిచినా టిమ్ బతికి బట్టకట్టగలిగాడు.
పాముల విష ప్రభావాన్ని పరిశోధించేందుకు, అతని శరీరం విషాన్ని తట్టుకునేందుకు వీలుగా ఉండేందుకు ఇలా చేశాడు. ప్రస్తుతం టిమ్‌కు ఏ పాము కరిచినా ఏమీ కావడం లేదంట. ప్రపంచవ్యాప్తంగా పాము కాటుకు గురై చనిపోతున్న వేలాదిమందిని కాపాడేందుకు తాను ఈ పరిశోధనలన్నీ చేస్తున్నానని చెబుతున్నారు. 2011లో ఒకేసారి రెండు కోబ్రా పాముల చేత కరిపించుకుని కోమాలోకి వెళ్లాడు. చావు అంచులదాకా వెళ్లి అదృష్టవశాత్తూ బతికాడు. ప్రస్తుతం టిమ్ శరీరంలో సాధారణ మనుషుల్లో కంటే అనేక రెట్లు అధికంగా యాంటీబాడీలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విషపాముల నుంచి మానవులను కాపాడే వ్యాక్సిన్‌ను తయారు చేసే ప్రయత్నాల్లో మునిగిపోయాడు టిమ్.