పాడవుతున్నా పట్టించుకోరా?
టింబర్ డిపోలో వృథాగా ఉంటున్న కలప
పట్టించుకోని ఎఫ్‌డీవో
వినాయక్‌నగర్(నిజామాబాద్ అర్బన్): స్మగ్లర్లు అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్న టేకు కలపను వేలం వేయకుండా అటవీ అధికారులు వృథాగా పడవేశారు. రూ.లక్షల విలువ చేసే కలప ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ పాడవుతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. స్మగ్లర్ల నుంచి కలపను అటవీశాఖ అధికారులు పట్టుకుని టింబర్ డిపోలో నిల్వ చేస్తారు. ప్రస్తుతం రూ.10 లక్షలకు పైగా విలువ చేసే కలప ప్రస్తుతం టింబర్ డిపోలో నిల్వ ఉన్నా అధికారులు స్పందించడం లేదు.
దాదాపు మూడేళ్ల నుంచి పట్టుకున్న అక్రమ కలపను జిల్లా కేంద్రంలోని వర్నిరోడ్‌లో గల అటవీశాఖ సర్కిల్ కార్యాలయంలో అవరణలోని టింబర్ డిపోలో నిల్వ చేసి ఉంచారు. గత 3 సంవత్సరాల నుంచి దాదాపు 10 సార్లు వేలం వేశారు. మిగిలిక కలప అలాగే ఉండిపోయింది. అటవీశాఖ అధికారులు ప్రతి నెలా 5వ తేదీన వేలంపాట నిర్వహిస్తారు. గత 8 నెలల నుంచి వేలం వేయకపోవడంతో ఉన్న కలప పాడవుతోంది. తమపకు ధర గిట్టుబాటు కావడం లేదనే కారణంతో వ్యాపారులు కొనుగోలు చేయడం లేదని అధికారులు అంటున్నారు. ఘన్ఫీట్కు రూ.1600 నుంచి రూ.2000 వరకు టేకులాట్ (సైజ్)ను బట్టి ధర నిర్ణయించారు. వేలం పాటలో పాల్గొనే వారు ఈ ధర తమకు గిట్టుబాటు కావడం లేదని అంటున్నారు.
అప్సెట్ ప్రైస్ (నిర్ణయించిన ధర) నుంచి 20 శాతం తగ్గించే అధికారాలు ఎఫ్డీవోకు ఉంటాయి. అలా చేస్తే ఒకటి లేదా రెండు బీట్లలో కలప విక్రయం జరుగుతోంది. కానీ ప్రస్తుతం అలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కలప కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. గతంలో సబ్–డీఎఫ్‌వోగా విధులు నిర్వహించిన అధికారి ఫ్లైయింగ్ స్క్వాడ్ డీఎఫ్‌వోగా విధులు నిర్వహించారు. రాష్ట్ర విభజన తర్వాత అటవీ శాఖలో కూడా బీట్ల స్థాయి నుంచి సర్కిల్ విభజించారు. ప్రస్తుతం ఆయన నిజామాబాద్ ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్‌గా నిజామాబాద్‌కు వచ్చారు. గతంలో ఉన్న టెరిటోరియల్, సోషన్ ఫారెస్టు, ఫ్లైంయింగ్ స్వా్కగ్ విభాగాలను ఒకే విభాగంగా మార్చారు.
గతంలో ఆయన ఫ్లైయింగ్ స్క్వాడ్‌గా పనిచేయడంతో టెరిటోరియల్ విభాగంపై అవగాహన తక్కువగా ఉండడం, నిర్లక్ష్య వైఖరి కారణంగా కలప వేలంపై దృష్టిసారించడం లేదని ఆ శాఖ నుంచే త్రీవ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేంజ్ పరిధులు విభజించి దాదాపు సంవత్సరం గడిచింది. వర్ని రేంజ్ కార్యాలయం జిల్లా కేంద్రంలోని బీడీ లిఫ్ గోదాం నుంచి నిర్వహిస్తున్నారు. ఆ గోదాం ఖాళీ చేయించి బీడీ ఆకు నిల్వకు తమకు ఇవ్వాలని నార్త్ రేంజ్ అధికారి (డీఎఫ్‌వో) లేఖ రాసినా ఖాళీ చేయించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కలప వేలం వేయాలని పలువురు కోరుతున్నారు.