ప్రతీకాత్మక చిత్రం
చండీగఢ్: అనుమతించిన దాని కంటే ఎక్కువ సంఖ్యలో చెట్లను నరికివేశాడన్న కారణంగా ఓ కాంట్రాక్టర్‌కు పంజాబ్ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. 300 చెట్లను అక్రమంగా నేలమట్టం చేసినందుకు రూ.9 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. వివరాలు.. సిల్వికల్చర్ (కలప ఉత్పత్తికై చెట్ల పెరుగుదల నియంత్రణ)లో భాగంగా మొహాలిలోని మీర్జాపూర్ అడవిలో దాదాపు 6 వేల ఖేర్ చెట్లను నరికేందుకు అటవీ శాఖ అనుతినిచ్చింది.(ఊపిరి పీల్చుకున్న ముంబై)
ఈ క్రమంలో కపిల్ శర్మ అనే కాంట్రాక్టర్ చెట్ల నరికివేత కార్యక్రమాన్ని చేపట్టాడు. అయితే అతడు నిబంధనలు ఉల్లంఘించి మరో 300 చెట్లను అధికంగా నరికాడని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన పంజాబ్ విజిలెన్స్ బ్యూరో.. ఈ అంశంపై విచారణ చేపట్టింది. అతడు సెక్యూరిటీ డిపాజిట్ కింద జమ చేసిన డబ్బులో నుంచి ఇప్పటికే రూ. 5.72 లక్షలను కట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తంగా రూ. 9లక్షల జరిమానా విధించిన నేపథ్యంలో అతడి నుంచి మరో మూడున్నర లక్షలు త్వరలోనే వసూలు చేయనున్నట్లు వెల్లడించారు.(ఎల్జీ పాలిమర్స్ ఘటన: ఎన్‌జీటీ తీర్పు)
ఇక ఈ విషయంపై స్పందించిన కపిల్ శర్మ.. జరిమానా గురించి తనకేమీ సమాచారం లేదన్నాడు. కార్మికులు పొరబాటున ఈ తప్పు చేసి ఉంటారని.. తను ఉద్దేశపూర్వకంగా ఎలాంటి తప్పు చేయలేదని చెప్పుకొచ్చాడు. కాగా ప్రతీ ఐదేళ్లకోసారి రెండు ఫీట్ల కంటే ఎక్కువ వ్యాసం కలిగి ఉన్న చెట్లను మాత్రమే నేలమట్టం చేసే ప్రక్రియలో భాగంగా కపిల్ శర్మకు ఈ అవకాశం లభించింది. చెట్లను నేలమట్టం చేసి మార్చి 31 నాటికి కలపను తీసుకువెళ్లాలని అధికారులు అతడికి సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలో లాక్‌డౌన్ విధించిన తర్వాత కూడా ఈ తతంగం కొనసాగినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment