డీఎస్సీ చిక్కుప్రశ్నలు
కర్నూలు(జిల్లా పరిషత్): రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా ప్రకటించిన డీఎస్సీ అభ్యర్థులను గందరగోళానికి గురిచేస్తోంది. అర్హత మార్కులు.. సిలబస్.. పరీక్షా సమయం.. సబ్జెక్టులకు తక్కువ మార్కుల కేటాయింపు.. తదితర చిక్కు ప్రశ్నలతో వారి తలబొప్పి కడుతోంది. ప్రధానంగా సిలబస్ ప్రకటించకుండా నోటిఫికేషన్ జారీ చేయడం అసలు సమస్యకు కారణమవుతోంది. పరీక్షకు పాత సిలబస్‌తో సిద్ధమవ్వాలా? కొత్త సిలబస్‌ను చదువుకోవాలా? అనే మీమాంస కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ 122, లాంగ్వేజ్ పండిట్ 98, పీఈటీ 13, ఎస్జీటీ 497 కలిపి మొత్తం 730 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 21న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ విడత జిల్లాలో 30వేల మంది అభ్యర్థులు పోటీపడే అవకాశం ఉంది. అయితే సిలబస్ విషయమై ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడం గమనార్హం. పాత సిలబస్‌లోనే పరీక్ష నిర్వహించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
ప్రస్తుతం టెట్ కమ్ టెర్ట్ పేరిట టెట్, డీఎస్సీ కలిపి పరీక్ష నిర్వహిస్తుండటంతో గతంలో టెట్ అర్హత సాధించిన అభ్యర్థుల పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పుడు రెండు పరీక్షలకు ఒకేసారి సిద్ధం కావడం అసాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టెట్‌లోని సబ్జెక్టులు డీఎస్సీలో కలిపేయడం వల్ల అధిక మార్కులు సాధించడం కష్టమనే చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ఆయా రిజర్వేషన్ వర్గాలను బట్టి అర్హత మార్కులు నిర్దేశించడం కూడా అభ్యర్థుల్లో కలకలం రేపుతోంది. ఈ ప్రశ్నలకు డీఈఓ కార్యాలయ వర్గాల్లోనూ సమాధానం లేకపోవడం గమనార్హం.
డీఎస్సీ అభ్యర్థుల ఆందోళనకు కారణాలు
తెలుగు, హిందీ, ఉర్దూ బాషా పండితులకు గతంలో వారి సబ్జెక్టుల్లో 50 శాతానికి పైగానే ప్రశ్నలు ఇచ్చేవారు. ఇప్పుడు 35 శాతానికే సబ్జెక్టు ప్రశ్నలను పరిమితం చేశారు.
గతంలో టెట్‌లో మంచి మార్కులు సాధించిన అభ్యర్థులు తాజా డీఎస్సీలో తిరిగి టెట్‌ను రాయాల్సి ఉంది. టెట్ పాసయ్యామనే ధైర్యంతో చాలా మంది సబ్జెక్టులపైనే దృష్టి సారిస్తున్నారు. వీరి పరిస్థితి గందరగోళంగా ఉంది.
ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు పరీక్షలో 40 శాతం, బీసీలకు 50 శాతం, ఓసీలకు 60 శాతం మార్కులు తెచ్చుకోవాలని కొత్త నిబంధనలు చెబుతున్నాయి. గతంలో తక్కువ మార్కులు సాధించినా ఎస్సీ, ఎస్టీలు ఉపాధ్యాయ పోస్టులు సాధించారు. తాజా నిబంధనలతో ఆయా రిజర్వేషన్ వర్గాల్లో అర్హులైన వారు లభించక పోస్టులు మిగిలిపోయే ప్రమాదం ఉంది.
బ్లాక్‌లో పాత సిలబస్ పుస్తకాలు
నేను 2012లో బీఎడ్ పూర్తయింది. డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించడంతో పాత సిలబస్ పుస్తకాలకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో అంతా కొత్త సిలబస్ పుస్తకాలే. అందువల్ల పాత సిలబస్ పుస్తకాలు బ్లాక్‌లో అమ్ముతున్నారు. వీటిని కొనేందుకే రూ.2వేలు ఖర్చవుతోంది.
- నాగిరెడ్డి, వెల్దుర్తి
పరీక్షా సమయం సరిపోదు
సర్వీస్ కమిషన్ పరీక్షల్లో 150 మార్కులకు మూడు గంటల సమయం ఇస్తారు. తాజా డీఎస్సీలో 200 మార్కులకు కూడా 3 గంటల సమయం మాత్రమే కేటాయించారు. దీనికి తోడు అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించి, బబ్లింగ్ చేయాలంటే సమయం సరిపోదు.
- వసంతకుమారి, అనంతపురం
సిలబస్‌పై స్పష్టత కరువైంది
నేను 2012లో బీఈడీ పూర్తి చేశాను. డీఎస్సీ కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ప్రకటించినా గైడ్‌లైన్స్ చూస్తే ఆందోళన కలుగుతోంది. ఏ సిలబస్ ప్రకారం పరీక్ష నిర్వహిస్తారో చెప్పలేదు.
- ప్రసన్నలక్ష్మి, నంద్యాల
పాత సిలబస్‌తోనే పరీక్ష నిర్వహించాలి
నేను డీఎడ్ పూర్తి చేశాను. పాఠశాల విద్యాభ్యాసమంతా పాత సిలబస్‌లోనే జరిగింది. ఇప్పుడు సీసీఈ మెథడ్‌లో సిలబస్ ఉంది. ఇది నేటి తరం పాఠశాల విద్యార్థులకు అర్థమవుతుంది. మా లాంటి వారికి ఈ మెథడ్ అర్థం కావాలంటే చాలా కష్టం. పాత విధానంలోనే పరీక్ష నిర్వహించాలి.
- కె.ఇమ్రాన్, ఎమ్మిగనూరు
భాషా పండితులకు తీరని నష్టం
తాజా డీఎస్సీలో 200 మార్కులకు ప్రశ్నాపత్రం ఇస్తున్నారు. ఇందులో భాషా పండితుల(తెలుగు, ఉర్దూ, హిందీ)కు మాత్రం వారి సబ్జెక్టులో 70 మార్కులు ఇచ్చి, మిగిలిన 130 మార్కులకు జనరల్ ప్రశ్నలు అడుగుతున్నారు. గతంలో ఇలా ఉండేది కాదు. వంద మార్కులకు పైగానే సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు ఉండేవి. ఇది భాషా పండితులకు తీరని నష్టం చేకూరుస్తుంది.
- ఎం.చంద్రశేఖర్, అనంతపురం