తైమూర్‌తో తలగోక్కున్నారు!
ఎగ్జాక్ట్లీ అండీ. కరీనా కపూర్ దంపతులు తమ అడ్డాల బిడ్డడికి మంగోలు మహారాజు తైమూర్ పేరు పెట్టుకుని సోషల్ మీడియాలో తలవాచిపోయేలా తిట్లు తింటున్నారు. ‘అయినా సరే, అవన్నీ మేము పట్టించుకోము’ అని పొత్తిళ్లలోని బిడ్డను ముద్దాడుతూ మురిపెంగా చెబుతున్నారు కరీనా. తైమూర్ పేరు మీదే మొఘల్ సామ్రాజ్యం అవతరించింది. అతడి అసలు పేరు అమీర్ తైమూర్. ఉజ్బెకిస్థాన్‌లో పుట్టాడు. 68 ఏళ్లు జీవించాడు. (1336–1405). చంగీజ్ఖాన్లా ప్రపంచాన్ని జయించాలని బయల్దేరాడు. దండయాత్రలు చేశాడు. ఐరోపా, చైనా, అరబ్బు రాజ్యాలతో పాటు భారతదేశంలోనూ రక్తపాతం సృష్టించాడు.
హిందూదేశంలో ఈ తురుష్క చక్రవర్తి చేసిన ఆగడాలకు అంతేలేదని చరిత్రకారులు రాశారు కూడా. అలాంటి వాడి పేరును పెట్టుకోవడం ఏంటని నెట్ ఇంట ఇప్పుడు డిస్కషన్ నడుస్తోంది. ‘వీటన్నిటినీ మేమెలాగైతే పట్టించుకోవడం లేదో, నువ్వూ అలాగే నీ చుట్టూ్ట జరుగుతున్న వాటి గురించి పట్టించుకోవద్దనీ, తల వంచుకుని వెళ్లి, తల వంచుకుని ఇంటికి రమ్మనీ..’ తన కొడుక్కి చెప్తానని కరీనా అంటోంది. అవున్నిజమే అని సైఫ్ కూడా అంటున్నాడు. ఇప్పటికైతే.. తైమూర్‌ని తప్ప ఎవర్నీ పట్టించుకునే తీరికలో లేరు.
మంగోలు చక్రవర్తి తైమూర్