పేద పిల్లల ఆకలి తీరేదెలా?
మార్కాపురం, న్యూస్‌లైన్: సమైక్య నిరసనల దెబ్బకు అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజన పథకం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లా వ్యాప్తంగా 21 ప్రాజెక్టుల పరిధిలో సుమారు 4,500 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. అయితే పౌరసరఫరాల శాఖ సిబ్బంది సమ్మె బాట పట్టడంతో ఈ నెల కేంద్రాలకు బియ్యం సరఫరా జరగడం దుర్లభంగా మారింది. మార్కాపురం రూరల్, యర్రగొండపాలెం, బేస్తవారిపేట, కనిగిరి ప్రాజెక్టుల్లో ఇందిరమ్మ అమృతహస్తం పథకం కింద కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. మిగిలిన 17 ప్రాజెక్టుల్లో మధ్యాహ్న భోజన పథకం కింద బాలింత, గర్భిణులకు నెలకు 3 కిలోల బియ్యం, అర్ధకిలో కందిపప్పు, 500 గ్రాముల నూనె అందిస్తున్నారు.
అయితే మొత్తం 21 ప్రాజెక్టుల పరిధిలో 30వేల మంది 3 నుంచి 5 సంవత్సరాల్లోపు చిన్నారులకు కూడా మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఒక్కో విద్యార్థికి 75 గ్రాముల బియ్యం, 10 గ్రాముల కందిపప్పు, 5 గ్రాముల ఆయిల్‌ను కేటాయించారు. ఆకు కూర పప్పు, సాంబారు, కిచిడి, గుడ్లు, తదితర పదార్థాలు మెనూలో చేర్చారు. కానీ సమైక్యాంధ్ర సమ్మెకు ఖజానా సిబ్బంది కూడా మద్దతిస్తుండడంతో బిల్లులు చేతికిరాక అంగన్వాడీ కార్యకర్తలు సతమతమవుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా అధికమవడంతో పిల్లలకు భోజనం అందించడం తలకు మించిన భారంగా మారింది.