ఓటమ్ముకోవద్దు
తిరుమలాయపాలెం, న్యూస్‌లైన్: మద్యం, డబ్బు, ఇతర ప్రలోభాలకు లొంగి ఓటును దుర్వినియోగం చేసుకోవద్దని వరంగల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కాంతారావు సూచించారు. ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఓటు హక్కును డబ్బు, మద్యానికి అమ్ముకుంటే ఆ తర్వాత ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రపతి పాలనలో నడుస్తున్న ప్రభుత్వ వ్యవస్థలో చట్టాలు పకడ్బందీగా అమలవుతాయన్నారు. రాజకీయ పార్టీలు ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేసినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తిరుమలాయపాలెం పోలీస్‌స్టేషన్ ఆవరణలో మంగళవారం వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ జరిగేలా అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. ప్రజలు కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని సమర్థులైన లీడర్లను ఎన్నుకోవాలన్నారు. ఆస్ట్రేలియా, చైనా దేశాలతో పోలిస్తే మనదేశం 20 సంవత్సరాలు వెనుకబడి ఉందన్నారు. ఏ దేశానికి లేని యువశక్తి మనదేశానికి పుష్కలంగా ఉన్నా మనం ఎన్నుకునే లీడర్ల అసమర్థతే వెనుకబాటుకు కారణమని పేర్కొన్నారు. కుల, మత ప్రాతిపదికన ఓట్లు వేయవద్దని, గెలిచిన వ్యక్తి అన్ని కులాలు, మతాల వారికి పనులు చేయాలని అన్నారు. డీఐజీ రావడానికి ముందు ఖమ్మం డీఎస్పీ బాలకిషన్‌రావు వివిధ పార్టీల నాయకులతో ప్రతిజ్ఞ చేయించారు.
ఓటర్లను ఆకర్షించేందుకు ఎలాంటి ప్రలోభాలకు పాల్పడమని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎన్నికల ప్రవర్తన నియమావళిని తహశీల్దార్ శివదాసు వివరించారు. ఎన్నికల్లో ఎలాంటి హింస జరగకుండా బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి సీఐ రవీందర్‌రెడ్డి, ఎంపీడీఓ కె. రామ్మోహన్రావు, ఎన్నికల రిటర్నింగ్ అధికారి బి.శ్రీనివాసరావు, ఎస్సై బొంకూరి ఓంకార్‌యాదవ్ పాల్గొన్నారు.
సత్తుపల్లిలో...
సత్తుపల్లి : ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వరంగల్ రేంజ్ డీఐజీ ఎం.కాంతారావు తెలిపారు. సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి పౌరుడూ ఓటు వేయాలని పోలీస్‌శాఖ విస్త్రత ప్రచారం చేస్తోందన్నారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో యువతకు ఓటుపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం అక్రమ రవాణా జరగకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే సత్తుపల్లి డివిజన్లో రూ.26 లక్షలు స్వాధీనం చేసుకున్నామన్నారు. అసాంఘిక శక్తులపై నిఘా పెట్టామని.. బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నామన్నారు. రెవెన్యూ, పోలీస్ సమన్వయంతో పని చేస్తున్నారన్నారు. పోలింగ్స్టేషన్లలో సౌకర్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.