ట్రాన్స్‌కో నిర్లక్ష్యానికి ఎలక్ట్రీషియన్ బలి
కార్యాలయం వద్ద మృతదేహంతో ధర్నా
ఏఈనే కారణమని మృతుని సంబంధీకుల ఆరోపణ
బద్వేలు అర్బన్ : ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యానికి ఓ ప్రయివేటు ఎలక్ట్రీషియన్ బలయ్యాడు. ఈ సంఘటన బద్వేలు మండలంలోని లక్ష్మిపాళెంలో గురువారం జరిగింది. గ్రామంలో విద్యుత్ సరఫరాలో ఏర్పడిన అంతరాయాన్ని సవరించాలని ఏఈ కోరడంతో మరమ్మతు చేస్తూ విద్యుత్ షాక్‌తో ప్రైవేటు ఎలక్ట్రీషియన్ మృతిచెందాడు. తమకు న్యాయం చేయాలని కోరుతూ భార్య, పిల్లలు, బంధువులు, గ్రామస్తులుట్రాన్స్కో ఏఈ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. బద్వేలు మండలం అనంతరాజపురం పంచాయతీ లక్ష్మిపాళెంకు చెందిన కాకాని తిరుపతయ్య (45) ప్రయివేటు ఎలక్ట్రీషియన్.
ఇతనికి భార్య సుబ్బమ్మతో పాటు ముగ్గురు కుమారులు ఉన్నారు. అనంతరాజపురం పంచాయతీకి రెగ్యులర్ లైన్‌మన్ లేకపోవడంతో ఏ సమస్య వచ్చినా తిరుపతయ్యే చేస్తుండేవాడు. ట్రాన్స్‌కో అధికారులు కూడా సమస్యలు ఏవైనా ఉంటే తిరుపతయ్య ద్వారా చేయిస్తుండేవారు. ఈ క్రమంలో గురువారం గ్రామంలోని కొన్ని వ్యవసాయ మోటార్లకు విద్యుత్ సరఫరా రావడం లేదని రైతులు టౌన్ ఏఈ రాజేంద్రప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. లైన్ఇన్స్పెక్టర్ సుబ్బరాయుడు అందుబాటులో లేకపోవడంతో తిరుపతయ్యకు ఫోన్‌చేసి మరమ్మతు చేయాలని కోరారు.
మరమ్మతు చేయడానికి ఎల్సీ తీసుకున్నట్లుతిరపతయ్యకు ఏఈ చెప్పాడు దీంతో విద్యుత్ స్తంభం ఎక్కిన తిరుపతయ్య విద్యుత్ షాక్ తగిలి పైనుంచి కింద పడ్డాడు. గమనించిన సమీపంలోని రైతులు తిరుపతయ్యను ప్రభుత్వాస్పత్రికి తీసుకుని వెళ్లారు. అప్పటికే మృతిచెందాడని వైద్యులు నిర్థారించారు. దీంతో మృతుడి భార్య, పిల్లలు, బంధువులు, గ్రామస్తులు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని ఏఈ కార్యాలయం ఎదుట శవంతో ధర్నా నిర్వహించారు.
బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సుమారు రెండు గంటలపాటు ధర్నా నిర్వహించిన అనంతరం విద్యుత్ అధికారులు బాధితులు, గ్రామ పెద్దలతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ వెంకటప్ప, రూరల్ ఎస్ఐ నరసింహారెడ్డి బాధితులను శాంతింపచేశారు. తిరుపతయ్య మరమ్మతు చేస్తున్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిపి వేశామని, పక్కనే ఉన్న హెటె న్షన్ విద్యుత్ తీగలు తగిలి ఉండవచ్చని ఏడీఈ క్రిష్ణమూర్తి తెలిపారు.