కుటుంబ కథా చిత్రం ఎర్రబస్సు
తిరుపతి(మంగళం): ఆనాడు ఎస్వీ రం గారావు, రాజబాబు నటించిన తాతామనవడు ఎంతగా సూపర్‌డూపర్ హిట్ అయ్యిందో అదేవిధంగా దాసరి నారాయణరావు, మంచు విష్ణు నటిం చిన ఎర్రబస్సు సినిమా విజయవంతం అవుతుందని సినీహీరో మంచు మోహన్‌బాబు పేర్కొన్నారు. తిరుపతి గ్రూప్ థియేటర్లో విడుదలైన ఎర్రబస్సు సినిమాను శుక్రవారం రాత్రి మంచు మోహన్‌బాబు, ఆయన సతీమణి మంచు నిర్మల, కుమార్తె మంచు లక్ష్మి తిలకించారు. ఈ సందర్భంగా సినీ నటుడు మోహన్‌బాబు మాట్లాడుతూ తల్లి, తండ్రి, అవ్వ, తాత అనుబంధాల్లోని అనురాగాలను తెలిపే విధంగా ఎర్రబస్సు సినిమాను చిత్రీకరించారని తెలిపారు.
ఉమ్మడి కుటుం బంలో ఉన్న ఆత్మీయతలను గుర్తు చూస్తున్న సన్నివేశాల్లో కన్నీళ్లు పెట్టానని తెలిపారు. మా గురువు దాసరి నారాయణరావుతో కుమారుడు మంచు విష్ణు అద్భుతంగా నటించాడన్నారు. షిరిడీ సాయిబాబా, శ్రీవెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో తమ కుటుం బ సభ్యులు నటించిన ప్రతి సినిమాను ప్రేక్షకులు ఆదరించి, విజయవంతం చేస్తున్నారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం మంచు విష్ణు, మనోజ్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు సునీల్‌చక్రవర్తి దుశ్శాలువ కప్పి, పుష్పగుచ్చంతో మోహన్‌బాబును సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రూప్థియేటర్ మేనేజర్ సిద్ధారెడ్డి, కృష్ణకుమార్, యువసేన నాయకులు సాయి, ప్రదీప్, శశి, మూర్తి, అభిమానులు పాల్గొన్నారు.