తిరుపతిలో ప్రతి ఇంటికీ నీటి కొళాయి
{పజావాణికి విశేష స్పందన
పాత భవనాలను వెంటనే తొలగించండి
{పభుత్వ భూములను కాపాడండి
జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ ఆదేశం
తిరుపతిరూరల్: స్వచ్ఛ తిరుపతి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికీ తాగునీటి కొళాయి కనెక్షన్ ఇవ్వాలని కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ ఆదేశించారు. తిరుపతిలో సోమవారం కలెక్టర్ అధ్యక్షతన ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ వినయ్‌చంద్, జాయింట్ కలెక్టర్ నారాయణభరత్ గుప్త, అదనపు జేసీ వెంకటసుబ్బారెడ్డి, ఆర్డీవో వీరబ్రహ్మయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి అర్బన్, రూరల్ మండలాల నుంచి భూ సమస్యలపై పెద్దఎత్తున అర్జీలు వచ్చాయి. దరఖాస్తులను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలంటూ సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. తర్వాత సంబంధిత మండలాల తహశీల్దార్లు, వీర్వోలు, సర్వేర్లతో సమావేశం నిర్వహించి అర్జీల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
భూ సమస్యలపైనే 200 పైగా అర్జీలు వచ్చాయి. ముఖ్యంగా వేదాంతపురం పంచాయతీలో ఉపసర్పంచ్ జనార్దన్ యాదవ్ అతని అనుచరులు ప్రభుత్వ భూమి అయిన సర్వే నెం.250లో ప్లాట్లు వేసి లక్షలు చొప్పున అమ్మేసుకుంటున్నారని ఓటేరు ఎంపీటీసీ శారద, గ్రామస్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ భూకబ్జాలపై తక్షణం విచారణ జరపాలని కోరారు. ఈ సందర్భంగా రెవెన్యూ, మున్సిపల్, తుడా అధికారులతో పలు అంశాలపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే వేసవి కాలంలో తిరుపతి ప్రజలకు తాగునీరు అందించడానికి స్వచ్ఛ తిరుపతి కార్యక్రమం ద్వారా అర్హులైన వారంద రికీ ప్రతి ఇంటికి తాగునీటి కొళాయిలను అందజేస్తామన్నారు. దీనికి పట్టణ పరిధిలోని మెప్మా అధికారులు ప్రజలను భాగస్వామ్యులు చేయాలని సూచించారు. సీఎం పర్యటనలో తాగునీరు, ఇళ్ల వసతి, భూసమస్యలపై ఎలాంటి ఫిర్యాదులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తుడా పరిధిలోని రేణిగుంట, ఏర్పేడు, తిరుపతి అర్బన్, చంద్రగిరి మండలాల్లో రోడ్లు, రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి రెండు వారాల్లోపు పూర్తి వివరాలు సేకరించాలని తుడా అధికారులకు, జిల్లా సర్వేయర్లను ఆదేశించారు. పట్టణాల్లో శిథిలావస్థలో ఉన్న పాతభవనాలను గుర్తించి వాటిని తొలగించాలని సూచించారు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, తుడా, ఇంజనీరింగ్ అధికారులు రూరల్ తహశీల్దార్ యుగంధర్, సర్వేయర్ సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.