అడుగు వేయలేకపోయినా..ఏడడుగులు నడిచారు..!
శారీరకంగా వారిలో కొన్ని లోపాలు ఉండొచ్చు, కానీ మానసికంగా వారు మామూలు మనుషులే. సాటి మానవులతో సమానంగా ప్రేమానురాగాలతో కూడిన నిండైన వైవాహిక జీవితాన్ని ఆశిస్తున్నవారే. అంత సులభంగా నెరవేరని వారి ఆశలకు ఓ ట్రస్టు రూపంలో ఆలంబన చేకూరింది. మనసుకు నచ్చిన వ్యక్తిని మనువాడేలా చేసింది. అడుగు తీసి అడుగు వేయలేని వారి చేత ‘ఏడడుగులు’ వేయించింది. పిల్లాపాపలతో కేరింతలు కొట్టే నిండైన సంసార జీవితాన్ని ప్రసాదించింది.
చెన్నై నగరానికి 40 కిలోమీటర్ల దూరంలోని తిరుప్పోరూర్‌లో పంక్చర్ షాపు నడుపుతున్న రమేశ్‌కు మూడేళ్ల వయసులో రెండు కాళ్లూ చచ్చుపడిపోయాయి. ముస్లిం మతానికి చెందిన ఫరీదాబాను పిన్న వయసులోనే ఎడమకాలు కోల్పోయారు. దాంతో ఇద్దరికీ పెళ్లి సంబంధాలు రాలేదు. పెళ్లి అవుతుందన్న ఆశ కూడా వదిలేశారు. అలాంటి పరిస్థితుల్లో గత ఏడాది జరిగిన ఓ ప్రత్యేక స్వయంవరం వారిద్దరినీ కలిపింది. పరస్పరం ఇష్టపడటంతో పెద్దలను ఒప్పించి ట్రస్ట్ సాయంతో వివాహం చేసుకున్నారు.‘‘వికలాంగులమైన మాకు పెళ్లి కావడం, త్వరలోనే బిడ్డకు జన్మనివ్వ నుండడం ఊహించని విషయం. ఇది మాకు ఓ పునర్జన్మ లాంటిది. శారీరక లోపంతో కుంగిపోయే మా లాంటి వారికి కొత్త జీవితాన్ని స్తోంది చెన్నైలోని శ్రీగీతాభవన్ ట్రస్ట్’’ అన్నారు రమేశ్, ఫరీదాబాను దంపతులు.
ధనిక, పేద, విద్య, అవిద్య, జాతి, కుల, మతాల వివక్ష చూపకుండా ఉచిత వివాహాలతో వికలాంగులను ఒక ఇంటివారిని చేస్తోంది ఈ ట్రస్టు. గడచిన ఐదేళ్లుగా సత్సంప్రదాయ విధానంలో వివాహాలకు చట్టబద్ధత కల్పించి, సంపూర్ణమైన జీవితాన్ని ప్రసాదిస్తోంది.
ఆధ్యాత్మిక, సాంఘిక సేవా కార్యక్రమాల కోసం 1971లో చెన్నైలో శ్రీగీతాభవన్ ట్రస్ట్ ఏర్పడింది. మొదట్లో... ఉచితంగా గీతాబోధ, సంస్కృత పాఠాలు, హిందీ క్లాసులు, యోగా శిక్షణ, విద్యార్థులకు చిత్రలేఖనం, సంగీతం, ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహకాలు, పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం వంటివి నిర్వహించేవారు. సేవా కార్యక్రమాలతో మరింత వినూత్నంగా ముందుకు సాగాలనుకున్నారు. అవయవ లోపంతో అవివాహితులుగా మిగిలిపోతున్న వారిని ఒక ఇంటివారిని చేయాలన్న సంక ల్పంతో, ప్రత్యేక ప్రతిభావంతుల కోసం స్వయంవరం నిర్వహించాలని భావించింది ఈ ట్రస్ట్. ఈ ఆలోచన 2010లో కార్యరూపం దాల్చింది.
దేశంలోనే తొలిసారి...
దేశంలోనే తొలిసారిగా చేస్తున్న ప్రయత్నం కావడంతో అవివాహితుల హాజరుపై నిర్వాహకులు అనుమానపడ్డారు. వారి అనుమానాన్ని పటాపంచలు చేస్తూ వందలాది మంది హాజరయ్యారు. ట్రస్ట్ పెద్దల సాక్షిగా పెళ్లిళ్లు చేసుకున్నారు. అప్పటి నుంచి ట్రస్ట్ కార్యకలాపాల్లో ‘ప్రత్యేక స్వయంవరం’ ప్రధాన అంశంగా మారిపోయింది. పుట్టుకతో, ప్రమాదాలతో వికలాంగులైనవారే కాదు, కుష్ఠు వ్యాధిగ్రస్తులకూ ఇందులో అవకాశం ఉంది. వీరిలో ప్లస్ టూ నుంచి పీజీ వరకు చదివిన విద్యావంతులున్నారు. 2010లో తొలి ప్రయత్నంగా జరిపిన స్వయంవరంతో 34 జంటలు పెళ్లి పీటలెక్కాయి. ఇప్పటి దాకా దాదాపు 200 జంటలు ఇలా ఒక్కటయ్యారు.
నిబద్ధతతో నిర్వహణ
సామూహిక వివాహాలతో ఏకమైన జంటలు నిండు నూరేళ్లు కలిసి ఉండేలా నిబద్ధతతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మేనేజింగ్ ట్రస్టీ అశోక్ గోయల్. 18-36 ఏళ్ల వయసు వారు ఇందుకు అర్హులు. ఇతర ధ్రువీకరణ పత్రాల నకళ్లతో కూడిన దరఖాస్తులను పరిశీలించి, స్వయంవరానికి కబురు పంపుతారు. పెద్దల సమక్షంలో వధూవరుల నిర్ణయం జరిగిన తరువాత వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు, లాయర్లు కౌన్సెలింగ్ ద్వారా వధూవరులకు అన్ని విషయాలను వివరిస్తారు.
అన్నింటికీ అంగీకరించినట్లుగా వారి నుంచి ఒప్పంద పత్రం తీసుకుని, హిందూ సంప్రదాయం ప్రకారం వేదపండితులతో వివాహం జరిపిస్తారు. ‘‘ఇతర మతాల వారు ట్రస్ట్ అనుమతితో వారికి ఇష్టమైన చోట పెళ్లి చేసుకోవచ్చు. ట్రస్ట్ అధ్వర్యంలో జరిగే వివాహాలకు రిజిస్ట్రారును హాజరుపరిచి రిజిస్ట్రేషన్ పత్రం మంజూరు చేయడం ద్వారా వీరి వివాహానికి చట్టబద్ధత కల్పిస్తున్నాం’’ అని అశోక్ వివరించారు.
బంగారు తాళిబొట్టు, వధూవరులకు నూతన వస్త్రాలు, కొత్త కాపురానికి అవసరమైన వంటసామాగ్రి, నెలకు సరిపడా బియ్యం, సరుకులు ఉచితంగా ఇవ్వడం మరో విశేషం. మంచి మనసుకూ, మనుషుల సేవకూ వైకల్యం ఉండాల్సిన పని లేదనడానికి ఇదే నిదర్శనం.
- కొట్రా నందగోపాల్, బ్యూరో ఇన్చార్జ్, చెన్నై
ఫోటోలు: వన్నె శ్రీనివాసులు
వివాహంతో కొత్త వెలుగు
వికలాంగులమైన మాకు జీవితంలో ఎప్పటికైనా వివాహం జరుగుతుందా అని ఆందోళన చెందాం. గీతాభవన్ ట్రస్ట్ మా జీవితాల్లో వెలుగులు నింపింది.
- రమేశ్, ఫరీదాబాను
సెప్టెంబరు 5 న తాజా స్వయంవరం
వికలాంగుల నుండి అపూర్వ స్పందన రావడంతో ఎప్పటిలాగే ఈ ఏడాది సెప్టెంబరు 5న చెన్నైలోని ట్రస్ట్ హాలులో స్వయంవరం నిర్వహిస్తున్నారు. అర్హులైన జంటలకు నవంబరు 6న సామూహిక వివాహాలు జరిపిస్తారు. ఇందుకోసం జూలై 31లోగా ట్రస్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలి.
చిరునామా:
శ్రీగీతాభవన్ ట్రస్ట్, 334, అవ్వై షణ్ముగం రోడ్డు, గోపాలపురం, చెన్నై - 600 086. ఫోన్స్ 044-28351513, 9445198100. దరఖాస్తు ఫారాలను tnhfctmatri.com/ geetabhavantrust.com ల ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇ-మెయిల్: gbhavantrust@gmail.com / tnhfctrust@ yahoo.co. in