మహిళ కడుపులో 15 కిలోల కణితి
హయత్‌నగర్: కడుపునొప్పితో బాధపడుతున్న ఓ మహిళ కడుపులో పెరిగిన సుమారు 15 కిలోల బరువైన కణితిని బుధవారం హయత్‌నగర్‌లోని టైటన్ బ్రిజిల్ కోన్ ఆసుపత్రి వైద్యులు తొలగించారు. ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ అధికారి డా. శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం... మంచాల మండలం తిప్పాయిగూడకు చెందిన ఎస్.కమలమ్మ (55) గత మూడు సంవత్సరాలుగా కడుపునొప్పితో బాధపడుతుంది.
పలు ఆసుపత్రులలో చికిత్స చేసుకున్నా నయం కాలేదు. ఈ నెల 23న హయత్‌నగర్‌లోని టైటన్ ఆసుపత్రికి వచ్చింది. ఆమెకు చికిత్స చేసిన డాక్టర్లు సిటీ స్కానింగ్ పరీక్ష ద్వారా ఆమె కడుపులో బరువైన కణితి పెరిగినట్లు గుర్తించారు. బుధవారం ఉదయం లాప్రోస్కోపీ, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ కార్తిక్, సరిత టీంలు కమలమ్మకు శస్త్ర చికిత్స చేసి కడుపులో పెరుగుతున్న కణితిని తొలగించారు. కణితి బరువు సుమారు 15 కిలోలు ఉందని అరుదుగా ఇలాంటి కణితి పెరుగుతుందని, ప్రస్తుతం కమలమ్మ కోలుకుంటోందని వైద్యులు తెలిపారు.