వెరైటీ టైటిల్ తో వస్తున్న ధనుష్
చెన్నై: వరుస భారీ విజయాలతో జోరు మీదున్న తమిళ స్టార్ హీరో ధనుష్ మరింతగా దూసుకుపోతున్నాడు. విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ క్రేజీ హీరో చేతినిండా ప్రాజెక్టులతో బిజీబిజీగా మారనున్నాడు. తాజాగా తమిళంలో మరో సినిమాకు సైన్ చేసి తన హవాను కొనసాగిస్తున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీని ఈ శుక్రవారం అఫీషియల్ గా లాంచ్ చేశారు. కోడి గా టైటిల్ ఖరారు చేసుకున్న ఈ మూవీ షూటింగ్ కార్యక్రమాలు ఈ నెలలోనే ప్రారంభం కానున్నాయని చిత్ర యూనిట్ తెలిపింది.
అయితే ధునుష్ లేటెస్ట్ మూవీ తంగమగన్ చిత్రం ట్రైలర్, ఆడియో నెటిజన్లను బాగానే ఆకట్టుకుంది. ధనుష్ సరసన సమంతా, అమీ జాక్సన్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాకి వేల్ రాజ్ దర్శకత్వం వహించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. తెలుగులో నవ మన్మథుడు పేరుతో వస్తోంది. ఈ సంవత్సరంలో ధనుష్ నటించిన రెండు సినిమాలు ఇప్పటికే విజయం సాధించగా మూడో సినిమా ఈ డిసెంబర్ 18 న థియేటర్లను పలకరించనుంది.
ధురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో ధనుష్ సరసన త్రిష నటించనుందని సమాచారం. కోడి అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన ఈ మూవీ పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్నట్టు సమాచారం. డిసెంబర్ చివరివారంలో సెట్స్ పైకి తీసుకు వెళ్ళనున్నామని చిత్ర వర్గాలు వెల్లడించాయి.