TK Rajiv Kumar
-
పాత కాంబినేషన్... కొత్త సినిమా...
హీరో కమలహాసన్ ఇప్పుడు మంచి ఊపు మీద ఉన్నారు. ఒక సినిమా సెట్స్‌లో ఉండగానే, తరువాతి సినిమాకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇటీవలే ‘చీకటి రాజ్యం’ (తమిళంలో ‘తూంగా వనమ్’)తో ప్రేక్షకులను పలకరించిన ఆయన టి.కె. రాజీవ్ కుమార్ దర్శకత్వంలో తెలుగు, తమిళాల్లో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. జరీనా వహాబ్, అక్కినేని అమల నటిస్తున్న ఆ చిత్రం తాలూకు ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ‘అమ్మానాన్న ఆట’ అని పేరు పెట్టిన ఆ సినిమాలో కమల్‌తో కలసి ఆయన కుమార్తె శ్రుతీహాసన్ కూడా నటించనున్నారు. తండ్రీ కూతుళ్ళిద్దరూ కలసి నటిస్తున్న తొలి సినిమా అదే. ఇన్ని విశేషాలున్న కొత్త సినిమా పని హడావిడిలో ఉండగానే, కమల్ ఆ తరువాతి సినిమాకు కూడా ప్లాన్ సిద్ధం చేసినట్లు భోగట్టా. తెలుగు, తమిళాల్లో వాణిజ్యపరంగా సక్సెస్ అనిపించుకున్న ‘చీకటి రాజ్యం’ దర్శకుడు రాజేశ్ ఎం. సెల్వా దానికి దర్శకుడట! గతంలో దాదాపు ఏడేళ్ళ పాటు తన దగ్గర సహాయకుడిగా పనిచేసిన రాజేశ్‌తో ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ కొత్త సినిమాకు కమల్ శ్రీకారం చుడతారట! ‘‘ఇది పూర్తిస్థాయి యాక్షన్ సినిమా. మారిషస్‌లో చిత్రీకరించాలని భావిస్తున్నారు. నిజానికి, ‘చీకటి రాజ్యం’ కన్నా ముందే ఈ కథను తెరకెక్కించాలని భావించారు. కానీ, అప్పట్లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్క లేదు. మళ్ళీ ఇప్పుడు ఇదే కాంబినేషన్లో ఆ ప్రాజెక్ట్‌లో కదలిక వచ్చింది’’ అని కోడంబాకమ్ వర్గాల కథనం. అంటే, మొత్తానికి కమలహాసన్ ఈ ఏడాది చకచకా రెండు సినిమాలు చేయనున్నారన్న మాట! మన అగ్ర హీరోలందరూ నిదానంగా అడుగులు వేస్తుంటే, వయసు, అనుభవం పెరిగిపోతున్నకొద్దీ కమల్లో జోరు పెరిగిపోతుండడం విశేషమే!! -
ఫస్ట్ టైమ్... తెరపైనా తండ్రీ కూతుళ్ళు!
మన సినిమాల్లో వారసులకు భలే క్రేజు. అందులోనూ సూపర్‌స్టార్ తండ్రి, స్టార్‌గా పేరు తెచ్చుకుంటున్న వారసులైతే వేరే చెప్పనక్కరలేదు. వారిద్దరూ కలసి ఒకే సినిమాలో నటిస్తే, ఇక డబుల్ క్రేజ్ ఖాయం. ఇప్పుడు కమలహాసన్ కుటుంబం నుంచి అలాంటి ఒక క్రేజీ ప్రాజెక్ట్ రానున్నట్లు భోగట్టా. కమలహాసన్ కుమార్తె శ్రుతీహాసన్ సినీరంగ ప్రవేశం చేసినప్పటి నుంచి తండ్రితో కలసి ఆమె ఎప్పుడు నటిస్తారా అని అందరూ ఎదురుచూస్తున్నారు. కాగా, ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. రాబోయే ఒక చిత్రంలో తండ్రీ కూతుళ్ళిద్దరూ కలసి నటిస్తున్నారు. విశేషం ఏమిటంటే - ఆ సినిమాలోనూ వాళ్ళు తండ్రీ కూతుళ్ళుగానే కనిపించనున్నారు. జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు టి.కె. రాజీవ్ కుమార్ ఈ తండ్రీ కూతుళ్ళిద్దరూ నటించే స్క్రిప్ట్ ఆలోచించారు. ఆ ఆలోచన నచ్చి కమల్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారని చెన్నై కోడంబాకమ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి, రాజీవ్ కుమార్ దర్శకత్వంలో ఫ్యామిలీ సెంటిమెంట్స్ నిండిన ఒక రొమాంటిక్ కామెడీ సినిమాను కమలహాసన్ ఇప్పటికే చేస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్న ఈ సినిమాకు తెలుగులో ‘అమ్మా నాన్న ఆట’ అనే పేరు కూడా పెట్టారు. జరీనా వహాబ్, అమల అక్కినేని కూడా ఆ సినిమాలో ఉన్నారు. మరి... ఇప్పుడు శ్రుతీహాసన్ కూడా అదే సినిమాలో నాన్నతో కలసి నటిస్తున్నారా? లేక అది పూర్తిగా కొత్త స్క్రిప్టు, సినిమానా అన్న వివరాలు ఇంకా స్పష్టం కాలేదు. సినిమా ఏదైనా, ఇప్పటికైతే కమల్, శ్రుతీహాసన్లు కలసి నటించడం వరకు కన్ఫర్మ్. మిగతా వివరాల కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందే.