అమ్మ మరో కానుక
ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే శిశువులకు కానుకగా 16 రకాల వస్తువుల పంపిణీకి మంగళవారం సీఎం జయలలిత శ్రీకారం చుట్టారు. సచివాలయంలో ఐదుగురు పిల్లల తల్లులకు బాక్సుల్ని అందజేశారు.
చెన్నై: గర్భిణులకు పౌష్టికాహార పథకం, ప్రభుత్వాస్పత్రుల్లో ప్రత్యేకంగా ప్రసూతి వైద్య సేవలు, శిశు సంరక్షణ, బిడ్డ, తల్లి ఆర్యోగ భద్రత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించే శిశువులకు కానుకల పంపిణీకి సిద్ధమయ్యారు. ఆరోగ్య బీమా పథకంలో చేసిన మార్పులు చేర్పులు, డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి ప్రసూతి పథకం మేరకు ప్రభుత్వాసుపత్రుల్లో జన్మించే పిల్లల కోసం అమ్మ శిశు సంక్షేమ కానుక పేరిట సికొత్త పథకానికి శ్రీకారం చుట్టారు.
కానుకల పంపిణీ : సచివాలయంలో ఉదయం జరిగిన కార్యక్రమంలో ఐదుగురు పిల్లల తల్లులకు కానుకను సీఎం జయలలిత అందజేశారు. చిన్నపాటి సూట్ బాక్సు రూపంలో ఉన్న ఈ కానుకలో రూ. వెయ్యి విలువగల వస్తువుల్ని పొందుపరిచారు. ఇందులో టవల్, చిన్నపాటి చేతి పరుపు, సోప్, ఆయిల్, న్యాప్కిన్, పౌడర్, షాంపు తదితర 16 రకాల వస్తువుల్ని ఉంచారు. ఈ కానుకల పంపిణీ నిమిత్తం ఈ ఏడాదికి గాను రూ. 67 కోట్లను కేటాయించినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
ఇక, ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించి శిశువులకు అక్కడికక్కడే ఈ కానుకల పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి ఓ పన్నీరు సెల్వం, ఆరోగ్య మంత్రి విజయ భాస్కర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్ఞాన దేశికన్, సలహాదారు షీలా బాలకృష్ణన్, ఆరోగ్య శాఖకార్యదర్శి రాధాకృష్ణన్ పాల్గొన్నారు.