పొలంలో యువకుడి అస్థి పంజరం లభ్యం
ముదిగుబ్బ : అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండల పరిధిలోని టీఎన్ పాళ్యెం బస్ షెల్టర్ వెనుక ఉన్న పొలంలో ఓ యువకుడి అస్థి పంజరం బయటపడింది. సోమవారం సదరు రైతు పొలాన్ని దుక్కి దున్నుతుండగా గొర్రు తగులుకొని పుర్రె బయటపడింది. భయాందోళనకు గురైన రైతు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అస్థి పంజరం లభ్యమైన ప్రదేశంలో గుంత తవ్వించారు. పుర్రె, శరీరంలోని అస్థికలతో పాటు చిరిగి ఉన్న దుస్తులు బయట పడ్డాయి.
మృతదేహం వద్ద లభించిన ఆధారాలను బట్టి హతుడు వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన బాబ్జాన్(24)గా పోలీసులు గుర్తించారు. వెంటనే వారు పులివెందుల పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో బాబ్జాన్ కొద్ది నెలల నుంచి కనిపించడం లేదని, ఈ మేరకు అదృశ్యం కేసు కూడా నమోదైందని నిర్ధారించినట్లు తెలిసింది. అగంతకులు ఇతన్ని హతమార్చి మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి హడావుడిగా పూడ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రెడ్డెప్ప తెలిపారు.