మొక్కల సంరక్షణలో నంబర్‌వన్‌గా నిలవాలి
సంరక్షణకు అనువైన చోటనే నాటండి
మంత్రి ఈటల రాజేందర్
టీఎన్జీవోల ఆధ్వర్యంలో హరితహారం, వనభోజనం
ముకరంపుర: హరితహారంలో భాగంగా మొక్కలనాటడంలో ఉన్న పోటీతత్వాన్ని వాటి సంరక్షణలో చూపి రాష్ట్రంలోనే జిల్లాను నంబర్‌వన్‌గా నిలపాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. టీఎన్జీవో జిల్లా శాఖ ఆధ్వర్యంలో భగత్‌నగర్‌లోని టీఎన్జీవో కోఆపరేటివ్ హౌసింగ్సొసైటీ కాలనీలో హరితహారం వారోత్సవాలను బుధవారం ప్రారంభించారు. అనంతరం వన భోజనం కార్యక్రమంలో ఉద్యోగులు సామూహికంగా భోజనాలు చేశారు. కాలనీలో మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రజల సంఘటిత శక్తిపై ఉన్న నమ్మకంతో ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజక నిర్ణయాలు తీసుకుంటారన్నారు. హరితహారంలో మొక్కలు నాటేందుకు ప్రతి ఒక్కరూ కనీస కర్తవ్యంగా స్పందించడం కేసీఆర్ సాధించిన విజయమేనని పేర్కొన్నారు.
మొక్కల సంరక్షణకు అనువుగా ఉన్న చోటనే నాటాలని సూచించారు. అంగన్వాడీలకు మూడు నెలలుగా జీతాలు రాలేదని ఆయన దృష్టికి తేవడంతో చిన్న ఉద్యోగులకు జీతాలు రాకుంటే వారి బాధ తెలుసునని, ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరలోనే సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కలెక్టర్ నీతూప్రసాద్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, టీఎన్జీవోస్ కోఆపరేటివ్ హౌజింగ్ బిల్డింగ్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు మారం జగదీశ్వర్, దారం శ్రీనివాస్‌రెడ్డి, కోశాధికారి గూడ ప్రభాకర్‌రెడ్డి, డైరెక్టర్లు రవీందర్, హర్మీందర్‌సింగ్, లక్ష్మి, మామిడి రమేశ్, శ్రీధర్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి సుగుణాకర్రెడి, జిల్లా ఉపాధ్యక్షుడు రాంకిషన్‌రావు, టీఎన్జీవోస్ పట్టణ కార్యదర్శి కాళీచరణ్, నాయకులు సుధీర్, ఈశ్వర్ప్రసాద్, కిరణ్, రాజేశ్, తిరుమల్ పాల్గొన్నారు.