‘బంగారు తల్లి’కి మంగళం!
- చట్టాన్ని రద్దు చేసేందుకు సర్కారు సన్నాహాలు
- ఇప్పటికే ఉన్న లబ్ధిదారుల విషయంలో వీడని సందిగ్ధం
సాక్షి, హైదరాబాద్: ఆడపిల్లల బతుక్కి భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ‘బంగారు తల్లి’ పథకం కనుమరుగు కానుంది. దీనికి స్వస్తి చెప్పాలని ప్రభుత్వం దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చింది.
ఉమ్మడి రాష్ట్రంలో భ్రూణ హత్యలను నివారించడంతో పాటు ఆడపిల్లలకు ప్రోత్సాహాన్ని అందించేందుకు 2013 మే 1న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అదే ఏడాది జూన్ 19న బంగారు తల్లి పథకానికి ప్రత్యేకంగా సాధికారత చట్టం కూడా తెచ్చింది. ఈ చట్టం ద్వారా ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి డిగ్రీ పూర్తయ్యేదాకా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
గడచిన ఏడాదిన్నర నుంచే లక్షల సంఖ్యలో దరఖాస్తులను పెండింగ్లో పెట్టింది. ఏపీ పునర్విభజన చట్టం మేరకు గత ప్రభుత్వం చేసిన చట్టాన్ని తెలంగాణ రాష్ట్రానికి వర్తింపచేసేందుకు సర్కారు చర్యలు చేపట్టకపోగా, ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవడం ద్వారా బంగారుతల్లి పథకాన్ని రద్దు చేయాలని తాజాగా నిర్ణయించింది. చట్టం ఉపసంహరణకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. కేంద్రం నుంచి అనుమతి తీసుకోవడంతో పాటు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకూ సన్నాహాలు చేస్తోంది.
ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం గత రెండు బడ్జెట్లలోనూ నిధులు కే టాయించకపోవడంతో ఇప్పటికే ఎంపికైన సుమారు లక్ష మంది బంగారు తల్లులు ఆర్థిక సాయం కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. 2013-14లో దరఖాస్తు చేసుకున్న 72,869 మందికి మొదటి విడతగా రూ.18.22 కోట్లు మాత్రమే అందింది. రెండో విడతను ఇంతవరకు ఇవ్వలేదు. 2014-15లో వచ్చిన దరఖాస్తుల్లో పరిశీలన అనంతరం 67,848 మందిని అర్హులుగా ఎంపిక చేశారు. ఆపై పాత లబ్ధిదారులకు గానీ, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి గానీ ఎటువంటి లబ్ధి చేకూరలేదు.