ఉరవకొండ.. హామీల బండ
- సీఎం గారూ.. గుర్తున్నాయా!
అత్యంత కరువు పీడిత ప్రాంతమైన ఉరవకొండ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్న సీఎం చంద్రబాబు నాయుడు ఆ ఊసే మరిచారు. అధికారంలోకి రాక మునుపు 2014 మార్చిలో ‘మీకోసం వస్తున్నా’ పాదయాత్ర సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలుకు నోచుకోని పరిస్థితి. ప్రస్తుతం అధికారం చేపట్టి మూడేళ్లు గడుస్తున్నా నోరు మెదపని చంద్రబాబు నేడు మరోసారి ఇక్కడి ప్రజల ముందుకు రాబోతున్నారు. మాటలతో మాయ చేసే సీఎం.. ఇప్పుడు సరికొత్త హామీలతో ఎలాంటి గారడీ చేస్తారోనని ప్రజల్లో చర్చ జరుగుతోంది.
- ఉరవకొండ:
1. మార్చి 12, 2014న ఉరవకొండలోని మూగబసన్న కట్ట వద్ద ఎస్సీ కాలనీలో మాదిగలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రాగానే పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి ఆమోదింపజేస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టి పెద్ద మాదిగనవుతానన్నారు. ఆయన అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయినా వర్గీకరణ ఊసే కరువయింది.
2.డ్వాక్రా మహిళలందరికీ రుణమాఫీ చేసి ప్రతి పొదుపు మహిళకు తిరిగి కొత్త రుణాలు మంజురు చేస్తామన్నారు. –నియోజకవర్గంలో వెయ్యి మంది మహిళలు డ్వాక్రా రుణాలు మాఫీ కాక చంద్రబాబు మోసం చేశాడంటూ కోర్టు మెట్లు ఎక్కారు. ఇదే సమయంలో డ్వాక్రా సంఘాలు ఛిన్నాభిన్నమయ్యాయి.
3. పేద ముస్లిం మహిళల ఉపాధికి కుట్టు శిక్షణనిప్పించి చిన్న తరహా కుట్టు పరిశ్రమను స్థాపిస్తామన్నారు. ఇప్పటి వరకు అతీగతీ లేదు.
4. ముస్లింలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించి, వారిని ఆర్థింగా ఆదుకుంటమన్నారు. మహానేత వైఎస్ కల్పించిన 4 శాతం రిజర్వేషన్ను కూడా నెలబెట్టుకోలేకపోతున్నారు.
5. ఉరవకొండ డిగ్రీ కళాశాలను అభివృద్ధి చేసి కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్ వసతి కల్పిస్తామన్నారు. ఇప్పటి వరుకు ఎలాంటి అభివృద్ధి కనిపించని పరిస్థితి.
6. జీడిపల్లి రిజర్వాయర్ నిర్వాసితులను అన్ని విధాల ఆదుకుంటామని.. వారికి మరో చోట ఇళ్లు నిర్మిస్తామన్నారు. వాస్తవంలోకి వస్తే నిర్వాసితులకు కనీసం స్థలాలు కూడా చూపించలేకపోయారు.
7. ఉరవకొండకు చేనేత టెక్స్టైల్ పార్కు, చేనేత రుణమాఫీ చేసి బ్యాంకుల్లో కార్మికులకు వడ్డీలేని రుణాలు రూ.లక్ష వరకు మంజూరు చేయిస్తామన్నారు. అయితే టెక్స్టైల్ పార్కు కాదు కదా.. రుణామఫీ కాకపోవడంతో కార్మికులు అప్పులపాలై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.