మెగా చెక్‌తో సరిపెట్టేనా?
నేడు ‘ఏరువాక పౌర్ణమి’కి హాజరుకానున్న సీఎం చంద్రబాబు
ఇన్పుట్, వాతావరణ, ఫసల్‌బీమా పరిహారం సొమ్ము పంపిణీపై స్తబ్ధత
అనంతపురం అగ్రికల్చర్ : గత ఖరీఫ్‌లో దెబ్బతిన్న పంటలకు సంబంధించి నష్టపోయిన రైతులకు ఈ నెల 9వ తేదీ నుంచి పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ) పరిహారం పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర మంత్రులు, కలెక్టర్ ఇది వరకే ప్రకటించారు. ఆ సమయం రానే వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం రాయదుర్గంలో జరిగే ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానుండడంతో, ఇప్పటికే చేతిలో చిల్లిగవ్వ లేక ఖరీఫ్ సేద్యానికి తటపటాయిస్తున్న ‘అనంత’ రైతన్నలు ఎన్నో ఆశలు పెంచుకున్నారు. అయితే ముందుగా ప్రకటించినట్లు రైతుల చేతికి ఇన్పుట్ సబ్సిడీ పరిహారం సొమ్ము అందజేస్తారా? లేదా రూ.1,032.69 కోట్ల ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ‘మెగా చెక్’ అందజేసి వెళ్లిపోతారా? అనేది తెలుస్తుంది. మెగా చెక్ అందజేస్తే పరిహారం కోసం రైతులు మరికొన్ని నెలలు ఎదురుచూడక తప్పదు.
గతేడాది వేరుశనగ, ఇతర పంటలకు వాతావరణ బీమా చేసుకున్న రైతులకు రూ.419 కోట్లు పరిహారం మంజూరు చేస్తున్నట్లు రెండు రోజుల కిందట బజాజ్ అలయెంజ్ కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి మండలాల వారీగా ఎన్ని కోట్లు, ఎంత మంది రైతులు, ఎన్ని హెక్టార్లు, హెక్టారుకు ఎంత పరిహారం వర్తించిందనే వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. మరో పక్క ఒక్కో రైతుకు హెక్టారుకు రూ.15 వేల చొప్పున గరిష్టంగా రెండు హెక్టార్లకు రూ.30 వేలు పరిహారం ఇస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై ఇన్సూ రెన్స్‌కు ఇన్‌పుట్‌సబ్సిడీ ముడిపెట్టి జాబితాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
మొదట ఇన్సూరెన్స్ ద్వారా వచ్చిన పరిహారం రైతుల ఖాతాల్లోకి జమ చేసిన తర్వాత రూ.30 వేల కన్నా తక్కువగా వచ్చిన రైతులకు ఇన్పుట్ పరిహారం ద్వారా సర్దుబాటు చేయనున్నారు. ఇన్సూరెన్స్ రూ.30 వేలు వచ్చిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వర్తించదనే ప్రచారం కూడా జరుగుతోంది. మరోపక్క ప్రధానమంత్రి ఫసల్‌బీమా కింద దాదాపు రూ.150 కోట్ల వరకు పరిహారం ఉండవచ్చని చెబుతున్నా దీనిపై స్పష్టత లేదు. కేవలం 2016కు సంబంధించి జిల్లా రైతులకు ఎంతలేదన్నా రూ.1,600 కోట్లకు పైగా పరిహారం. రుణమాఫీ కింద మూడో విడతలో రూ.416 కోట్లు అందాల్సివుంది. వీటిన్నింటిపై శుక్రవారం ఏరువాక పౌర్ణమిలో సీఎం చంద్రబాబు ఏ మేరకు భరోసా కల్పిస్తారో వేచి చూడాలి.