‘మార్గదర్శి’పై ఆర్బీఐ వేటు..
రాష్ట్రంలోని 31 ఎన్‌బీఎఫ్‌సీల
రిజిస్ట్రేషన్లను రద్దు చేసిన ఆర్బీఐ
జాబితాలో మార్గదర్శి ఇన్వెస్ట్మెంట్స్ అండ్ లీజింగ్ కంపెనీ, మార్గదర్శి
ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలు
హైదరాబాద్: రామోజీరావు సారథ్యంలోని ‘ఈనాడు’ గ్రూపునకు చెందిన రెండు ‘మార్గదర్శి’ సంస్థల్ని నాన్‌బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించకుండా రిజర్వు బ్యాంకు నిషేధించింది. నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్న మార్గదర్శి ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, మార్గదర్శి ఇన్వెస్ట్మెంట్ అండ్ లీజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్ని ఇకపై ఎలాంటి బ్యాకింగ్ కార్యకలాపాలూ నిర్వహించరాదని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఆర్బీఐ ఇచ్చిన నోటిఫికేషన్‌ను రాష్ర్ట సీఐడీ విభాగం మంగళవారం విడుదల చేసింది. రామోజీకి చెందిన రెండు సంస్థలతో పాటు రాష్ట్రంలోని పలు (నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ-ఎన్బీఎఫ్సీ)లు కూడా అందులో ఉన్నాయి. రిజర్వు బ్యాంకు చట్టంలోని 45(1ఎ) సెక్షన్‌ను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. ఎలాంటి కంపెనీ నాన్ బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించవచ్చో, ఎవరు రుణాలివ్వవచ్చో, ఎవరు డిపాజిట్లు స్వీకరించవచ్చనే వివరాలు 45(1ఎ) సెక్షన్లో ఉంటాయి.
దీన్ని ఉల్లంఘించిన సంస్థల్ని ఆర్బీఐ నిషేధిస్తూ ఉంటుంది. వాటి రిజిస్ట్రేషన్లను కూడా రద్దు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సంస్థలతో ఎటువంటి ఆర్థిక లావాదేవీలు నెరపవద్దని ప్రజలను హెచ్చరిస్తూ రాష్ర్ట సీఐడీ అదనపు డీజీ సత్యనారాయణ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా, నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ డిపాజిట్లు స్వీకరిస్తోందని గతంలో అప్పటి కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ బయటపెట్టడంతో రామోజీ గ్రూపు నానా యాగీ చేయడం తెలిసిందే. తర్వాత అక్రమంగా సేకరించిన డిపాజిట్లను తిరిగి ఇవ్వాల్సి రావడంతో నిధుల సమీకరణ కోసం పలు సంస్థల్ని సంప్రదించింది. చివరకు రిలయన్స్ సంస్థ నిధులివ్వడంతో ఆ మొత్తాన్ని రామోజీ తన డిపాజిటర్లకు చెల్లించారు. దీనిపై వివిధ న్యాయస్థానాల్లో పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
రిజిస్ట్రేషన్ల రద్దుకు కారణాలు
నాన్ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించకపోవడం
ఆర్బీఐ నిబంధనలను అమలు చేయకపోవడం, ఆర్బీఐ ఆదేశాల ప్రకారం ఖాతాల నిర్వహణలో విఫలమవడం
ఆర్బీఐ తనిఖీ అధికారుల ఆదేశాల మేరకు ఖాతా పుస్తకాలు, ఇతర రికార్డులను సమర్పించడంలో విఫలమవడం
డిపాజిట్ల స్వీకరణపై ఆర్బీఐ మూడు నెలలు, ఆపై నిషేధం విధించినా పాటించకపోవడం
మేమే రద్దు చేసుకున్నాం: రామోజీ గ్రూపు వివరణ
మా రెండు ఫైనాన్షియల్ సంస్థలు ఎన్నడూ ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించలేదు. రిజిస్ట్రేషన్ల రద్దు కోరుతూ స్వయంగా మేమే దరఖాస్తు చేసుకోగా, ఆర్బీఐ ఆ మేరకు రద్దు చేసింది. మా దరఖాస్తులకు సంతృప్తి చెందిన తర్వాత ఈ రెండు సంస్థల రిజిస్ట్రేషన్లను ఆర్బీఐ రద్దు చేసింది. తెలంగాణ సీఐడీ జారీ చేసిన పత్రికా ప్రకటన ప్రజలను గందరగోళానికి గురిచేసే విధంగా ఉంది.