రక్తదానం.. ప్రాణదానం
చేవెళ్ల: రక్తదానం ప్రాణ దానంతో సమానమని పెద్దలు చెప్పాలు. అయితే ప్రస్తుత తరుణంలో అవగాహనలోపంతో చాలా మంది రక్తదానానికి ముందుకు రావడం లేదు. దీంతో ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో రక్తం దొరకక సుమారు 78 శాతం మంది ప్రాణాలను కోల్పోవాల్సి వస్తున్నది. 2012 గణాంకాల ప్రకారం దేశంలో ప్రతి వెయ్యి మందికి నలుగురు మాత్రమే రక్తదానం చేయడానికి ముందుకువస్తున్నారు.
దీనికి ప్రజల్లో అవగాహన లోపమే కారణమని వైద్యులు చెబుతున్నారు. 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ఆరోగ్యవంతులు ప్రతి మూడు నెలలకోసారి రక్తదానం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే తాము బలహీనపడిపోతామనే అపోహతో చాలా మంది రక్తదానానికి ముందుకు రావడంలేదు. దేశంలో ప్రతి రెండున్నర సెకన్లకు ఒకరికి రక్తం అవసరం అవుతున్నది. ఒక వ్యక్తి దానం చేసిన రక్తం మరో నలుగుర్ని కాపాడుతుంది. ప్రమాదాలు, ప్రసవసమయంలో రక్తస్రావం జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
అలాగే గుండెకు సంబంధించిన ఆపరేషన్లు, క్యాన్సర్, రక్తహీనత, తలసీమియా, హిమోఫీలియా తదితరులకు కూడా కావాల్సినంత రక్తం దొరకకపోవడంతో ప్రాణాలు బలవుతున్నాయి. రక్తదానం చేస్తే కోల్పోయిన ప్లాస్మాను రెండు రోజుల్లో, కణాలను 21 రోజుల్లో శరీరం తిరిగి పొందుపరుచుకుంటుందని వారు వివరిస్తున్నారు.
రక్తదాతకు అర్హతలు
18 నుంచి 60 సంవత్సరాల వయస్సు, 45కేజీల కంటే అధిక శరీర బరువు కలిగిన వారు, రక్తపోటు, నాడీ రేటు, గుండె కొట్టుకునే స్థితి.. సాధారణంగా ఉన్నవారు రక్తాన్ని దానం చేయవచ్చు. 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ రక్తదానం చేస్తే జీవిత కాలంలో 168 సార్లు రక్తదానం చేయవచ్చు. ఈ లెక్కన ప్రతిఒక్కరూ 672 మంది ప్రాణాలు కాపాడిన వారవుతారు.
రక్తంలోని గ్రూపులు
1900 సంవత్సరం ప్రాంతంలో వియన్నా దేశానికి చెందిన డాక్టర్. కార్ల్ లాండ్ స్టైనర్ రక్తం గ్రూపులను మొదటిసారిగా కనుగొన్నారు. దీనికి గుర్తింపుగా 1930 సంవత్సరంలో ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. ఏ, బీ, ఏబీ, ఓ గ్రూపులుగా గుర్తించారు. ఏబీ గ్రూపు వారిని విశ్వగ్రహీతలు అని, ఓ గ్రూపు వారిని విశ్వదాతలు అని అంటారు.
ఆ ఉపాధ్యాయుడు ఆదర్శప్రాయుడు
రక్తదాన ఆవశ్యకతను గుర్తించిన చేవెళ్ల మండలంలోని కమ్మెట జిల్లా పరిషత్ ఉపాధ్యాయుడు పి.రామక్రిష్ణారావు 2007 నుంచి ఇప్పటివరకు 35 రక్తదాన శిబిరాలను స్వచ్ఛందంగా నిర్వహించారు. రక్తదానంపై ఎన్నో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటుచేశారు. ఈయన కృషిని ప్రభుత్వం కూడా గుర్తించింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం జూన్ 14న ఏపీ సాక్స్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం రాజయ్య చేతులమీదుగా రామక్రిష్ణారావు సత్కారాన్ని, ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.