కలల బండి ఆగేనా!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మొన్న మమత... నిన్న త్రివేది... ఇపుడు మల్లికార్జున ఖర్గే... కేంద్ర రైల్వే మంత్రులు ఎవరైనా...వారి బడ్జెట్లో జిల్లాకు ప్రయోజనం అంతంత మాత్రంగానే ఉంటోంది. 2013-14 సంవత్సరం లో కొంత మోదం.. మరికొంత ఖేదం మిగిల్చిన రైల్వే బడ్జెట్ ఈ సా రైనా ఆశాజనకంగా ఉంటుందా? అన్న సంశయాలు వ్యక్తమవుతున్నాయి.
గత బడ్జెట్లో సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ మీ దుగా బాసర, ముథ్కేడ్, ఆదిలాబాద్ వరకు డబుల్ లైన్ మంజూరు చేసినా అరకొర నిధులే కేటాయించారు. నిజామాబాద్- ముంబయి వరకు వేసిన ఎక్స్ప్రెస్ రైళ్లు ఆశాజనకంగా లేవు. పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వేలైను 2014 మార్చి వరకు పూర్తి చేస్తామని ప్రకటించినా... పెండింగ్లోనే ఉంది. ఆర్మూర్-ఆదిలాబాద్ వరకు కొత్త రైల్వేలైన్ ప్రతిపాదనకు మోక్షం కలగలేదు.
ఈసారైనా మేలు జరిగేనా
రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో జిల్లాకు ప్రయోజనం దక్కుతుందా? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవు తున్నాయి. గత బడ్జెట్లో జిల్లాకు కొత్త రైళ్లు, నిధులు కేటాయింపులపై రాజకీయ పక్షాలు, ప్రజల నుంచి మిశ్రమ స్పందన లభించగా, ఆ బడ్జెట్లో పేర్కొన్న పలు అంశాలు అమలుకు నోచుకోలేదు.
జిల్లాలోని రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, ఫై ్లఓవర్, పుట్ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, రైల్వే అభివృద్ధిపై బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించ లేదు. రెండు దశాబ్దాలుగా నత్తనడక నడుస్తున్న పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వేలైన్ మోర్తాడ్ వరకు వచ్చి ఆగిపోయింది. ఈ లైను పనులు పూర్తి చేస్తామన్నా,అమలుకు నోచుకోలేదు. ఆర్మూర్-ఆదిలాబాద్ వరకు కొత్త రైల్వేలైన్ పనులు చేపట్టలేదు. జిల్లా వ్యవసాయిక, పారిశ్రామిక, వ్యాపార అభివృద్ధికి ప్రధానంగా ఉపయోగపడే ఈ రెండు కొత్త రైల్వేలైన్ల పనులకు ఈసారైనా తుదిరూపు వస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.
ఎంపీల ప్రతిపాదనలు ఫలించేనా
రైల్వే బడ్జెట్ సందర్భంగా జిల్లా పరిధిలోని ఇద్దరు ఎంపీలు మధు యాష్కీ, సురేశ్ షెట్కార్ల ప్రతిపాదనలకు ఈసారైనా పూర్తిస్థాయిలో ఊరట లభిస్తుందా? అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. గత బడ్జెట్లో ఆర్మూర్ ఆదిలాబాద్ వరకు కొత్త రైల్వేలైన్ వేయటానికి గ్రీన్ సిగ్నల్ లభించినప్పటికి తగినన్ని నిధులు కేటాయించలేదు. ఫలితంగా ప్రతిపాదనలకే పరిమితమైంది. బోధన్-బీదర్ లైన్, ఆర్మూర్-నిర్మల్-ఆదిలాబాద్లైన్లను మరచి పూర్తిగా నిరాశకు గురి చేశారు.
సరుకు రవాణా భారం తగ్గించకపోగా మరింత పెం చి, ఆదర్శ స్టేషన్ల అభివృద్ధికి పైసా కూడ విదిల్చలేదు. కొత్త ప్యాసింజర్ రైళ్ల ప్రతిపాదనలకు మోక్షం కలగలేదు. ఈ నేపథ్యంలో పాత, కొత్త సమస్యలు, ప్రతిపాదనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు ఇద్దరు ఎంపీలు ప్రకటించినా.. ఈ సారి బడ్జెట్లోనైనా ఫలితం ఉం టుందా అన్న చర్చ జరుగుతోంది. కాగా నిజామాబా ద్, కామారెడ్డి రైల్వేస్టేషన్లను ఆదర్శ రైల్వే స్టేషన్లుగా ప్రకటించి ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆధునికీకరించిన దాఖలాలు లేవు. ఆదర్శంగా తీర్చిదిద్దటానికి తీసుకున్న చర్యలు కూడా లేవు.