మూడేళ్ల ప్రాయంలోనే నటించా
కడియం : మూడేళ్ల వయస్సున్నప్పుడే కెమెరా ముందు నటించినట్టు హీరో కౌశిక్‌బాబు తెలిపారు. బాల నటుడిగా టీవీ, సినిమా రంగాల్లో తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో నటించినట్టు ఆయన వెల్లడించారు. కౌశిక్ హీరోగా నటిస్తున్న ‘తొలి సంధ్యవేళలో’ సినిమా షూటింగ్ స్థానిక పల్ల వెంకన్న నర్సరీలో ఆదివారం జరిగింది. ఆ సందర్భంగా ఆయన తన నటనాప్రయాణంలో ఆసక్తికరమైన అంశాలను విలేకరులకు తెలియజేశారు.
సీరియల్స్‌తో తొలి అడుగు
మా నాన్నగారైన విజయబాబు (సమాచార హక్కు చట్టం కమిషనర్)కు స్నేహితుడు, డెరైక్టర్ అయిన సునీల్‌వర్మ మా ఇంటికి వచ్చినప్పుడు నన్ను చూసి ‘కళంకిత’ సీరియల్లో అవకాశం ఇచ్చారు. అలా మొదలైన నటనా ప్రస్థానంలో బాలనటుడిగా 50కి పైగా సీరియళ్లు, 20 వరకు సినిమాల్లో నటించాను. పలు విజయవంతమైన చిత్రాల్లో ప్రముఖ హీరోల చిన్ననాటి పాత్రలను పోషించాను. ‘టక్కరిదొంగ’ చిత్రంలో మహేష్‌బాబు చిన్ననాటి పాత్రకు నంది అవార్డు దక్కింది.
కేరళలో ‘కుట్టి ఎన్టీఆర్’
మహానటుడు ఎన్టీ రామారావుకు తెలుగుసినీరంగంలో రాముడు, కృష్ణుడు వంటి పాత్రల ద్వారా ఎంత పేరొచ్చిందో కేరళలో నాకు అలాంటి గుర్తింపు వచ్చింది. ‘స్వామి అయ్యప్ప’ సినిమాలో అయ్యప్ప పాత్రకు ఆ రాష్ట్ర ప్రభుత్వం మోస్ట్‌పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డునిచ్చింది. మళయాళ మనోరమ వారి ఫీచర్ఫిలిమ్ రామాయణంలో రాముడిగాను, గురవాయప్పన్ సీరియల్లో కృష్ణుడిగా విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో అక్కడి వారందరూ నన్ను కుట్టి ఎన్టీఆర్ (చిన్న ఎన్టీఆర్) అని పిలుస్తారు.
ఆదిశంకరాచార్యుడిగా..
యువహీరోలందరూ యాక్షన్చిత్రాలపై దృష్టిపెడుతుంటే ఆదిశంరాచార్య సినిమా తీసుకున్నారేంటని చాలా మంది తొలుత నన్ను అడిగేవారు. సాహిత్య అభిమాని, కళలను ప్రేమించే మా నాన్నగారు నా చిన్నప్పటి నుంచీ భక్తిభావం నూరిపోసారు. అందుకనే ఆ సినిమాకు అంగీకరించాను. అయితే ఆ సినిమా విజయవంతం కావడంతో పెదవి విరిచినవారే అభినందించారు. ఆ సినిమా ద్వారా నాకు మంచి గుర్తింపు లభించింది.
మాస్ పాత్రలవైపు
నేను బాల నటుడిగా ఉన్నప్పటి నుంచీ మాస్ ప్రేక్షకులను ఆకర్షించే డాన్స్, యాక్షన్స్ నేర్చుకున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ‘తొలిసంధ్యవేళ’లో చిత్రం నాకు హీరోగా మంచి గుర్తింపు వస్తుంది. గతంలో ‘పవిత్ర’ సినిమాలో కూడా కీలకపాత్ర పోషించాను.
ఎంబీఏ సెకండియర్‌లో ఉన్నా..
ప్రస్తుతం ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. షూటింగ్లవల్ల చదువుకు ఆటంకం కలగకుండా చిన్నప్పట్నుంచీ తగు జాగ్రత్తలు తీసుకున్నాను. కుటుంబ సభ్యుల సహకారంతో ఓపక్క చదువుకుంటూ మరో పక్క నటనలో కొనసాగగలిగాను.
ఈ జిల్లా నచ్చింది
తొలిసారిగా షూటింగ్ కోసం ఇక్కడకు వచ్చాను. ఇక్కడి ప్రకృతి అందాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మన రాష్ట్రంతోపాటు తమిళనాడు, కేరళలోని పలు ప్రాంతాల్లో ఇంతవరకు పర్యటించాను. అయితే ఈ జిల్లా ప్రకృతి అందాలు, ప్రజల ఆదరాభిమానాలు ఎప్పటికీ ప్రత్యేకమైనవే.