చర్మకాంతికి కందిపప్పు ఫేస్ ప్యాక్
న్యూ ఫేస్
మొటిమలు, యాక్నె, నల్ల మచ్చలు ముఖం మీద ఉంటే కందిపప్పుతో తయారుచేసిన ప్యాక్ వేసుకుంటే సరైన ఫలితం కనిపిస్తుంది. ముఖ్యంగా పొడి చర్మం గలవారికి ఈ ప్యాక్ తగినంత మాయిశ్చరైజర్‌ని అందిస్తుంది. ఫలితంగా చర్మ కాంతిమంతంగా కనిపిస్తుంది.
స్టెప్ 1: అర కప్పు కందిపప్పును కడిగి కనీసం 4-5 గంటల సేపు నీళ్లలో నానబెట్టాలి. నీళ్లన్నీ వడకట్టి మెత్తగా రుబ్బాలి. దీంట్లో పావు కప్పు పాలు, టీ స్పూన్ బాదం నూనె కలపాలి.
స్టెప్ 2: ముందుగా ముఖాన్ని చల్లని నీటితో శుభ్రంగా కడగాలి. తడి లేకుండా తుడవాలి. తయారుచేసుకున్న కందిపప్పు చిక్కటి మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల సేపు ఆరనివ్వాలి.
స్టెప్ 3: ముఖాన్ని కడిగేముందు కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ మునివేళ్లతో వలయాకారంగా మృదువుగా రుద్దుతూ ప్యాక్‌ని తొలగించాలి.
* ఈ ప్యాక్‌లో రోజ్‌వాటర్‌ని కూడా కలుపుకోవచ్చు. ఇలా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే చర్మం మృదువుగా, కాంతిమంతంగా మారుతుంది.
* యాక్నే సమస్య ఉన్న వారు మెత్తగా రుబ్బిన కందిపప్పు మిశ్రమంలో చిటికెడు పసుపు, అర టీ స్పూన్ శనగపిండి, ముప్పావు కప్పు పెరుగు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. పూర్తిగా ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి.
ముఖం మీద వెంట్రుకలు పోవాలంటే....
ముఖ చర్మం మీద ఉండే వెంట్రుకలను తొలగించడానికి కందిపప్పు ఫేసియల్ బాగా ఉపయోగపడుతుంది.
100 గ్రాముల కందిపప్పు, 50 గ్రాముల గంధంపొడి, నారింజ తొక్క పొడి, తగినన్ని పాలు కలిపి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఇవన్నీ కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ ప్యాక్‌ని ముఖానికి రాసి 15-20 నిమిషాలు ఉంచాలి. పైన కొన్ని నీళ్లు చల్లి ప్యాక్ మెత్తబడ్డాక మునివేళ్లతో వలయాకారంగా రుద్దుతూ నీళ్లతో శుభ్రపరుచుకోవాలి. దీంట్లో ఆలివ్ ఆయిల్‌ను కూడా వాడచ్చు.