సంపూర్ణ సేవలతో ఎస్బీఐ మినీ శాఖలు
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్) : రాబోయే తరానికి అనుగుణంగా ఎస్బీఐ బ్యాంకులను డిజిటలైజ్ చేస్తున్నామని బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ హర్దయాల్ ప్రసాద్ అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ సింధీకాలనీలో ఎస్బీఐ ఇన్టచ్ బ్రాంచ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ బ్రాంచ్‌లో ఇద్దరు ఉద్యోగులతో అన్ని డిజిటల్ సేవలు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. అకౌంట్ ఓపెనింగ్ నుంచి డెబిట్ కార్డు ప్రింటింగ్, డబ్బు డిపాజిట్, విత్డ్రాయల్తోపాటు అన్ని రకాల రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు.
నగరంలో ఇలాంటిదే మొట్టమొదటి శాఖ గచ్చిబౌలిలో ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే మరో 5 నుంచి 6 శాఖలు నగరంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాబోయే కొద్ది రోజుల్లో వరంగల్, అనంతపురం, కడప, విజయవాడ, విశాఖపట్టణంలో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ముఖ్యంగా వీటిని యువతను లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు.ఎస్బీఐలో మొత్తం 75 శాతం పేపర్‌లెస్ బ్యాంకులు పనిచేస్తున్నాయని, మొబైల్ బ్యాంకింగ్‌లో తాము అందరికంటే ముందున్నామన్నారు.